Begin typing your search above and press return to search.

మారుతీరావు చాలా సెన్సిటివ్.. నాటి కేసు ఎలా ఛేదించామో చెప్పిన రంగనాథ్!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుపై నల్గొండ న్యాయస్థానం సోమవారం తీర్పు ప్రకటించింది.

By:  Tupaki Desk   |   10 March 2025 5:06 PM IST
మారుతీరావు చాలా సెన్సిటివ్.. నాటి కేసు ఎలా ఛేదించామో చెప్పిన రంగనాథ్!
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుపై నల్గొండ న్యాయస్థానం సోమవారం తీర్పు ప్రకటించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అప్పటి నల్గొండ ఎస్పీ, ప్రస్తుతం హైడ్రా చీఫ్‌గా ఉన్న ఏవీ రంగనాథ్ ఈ కేసును ఎలా ఛేదించామో సంచలన విషయాలు బయటపెట్టారు.. ఈ హత్య పరువు కోసం చేసిన హత్య కాదని, ఒక వ్యక్తిని చంపడం ఏ రీతిలోనూ న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు. కేసును పకడ్బందీగా విచారణ జరిపి, అన్ని ఆధారాలతో నిందితులపై నేరాన్ని నిరూపించామని తెలిపారు. మారుతీరావు వ్యక్తిగతంగా సున్నిత స్వభావం కలిగిన వక్తి అని, ఆయన మృతి బాధాకరమని అన్నారు.

ప్రణయ్ హత్య కేసు దర్యాప్తును అత్యంత జాగ్రత్తగా నిర్వహించామని, ట్రయల్ సమయంలో నిందితుల తరపున తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతాయన్న అనుమానం ముందుగా వచ్చిందని రంగనాథ్ తెలిపారు. అందుకే అన్ని కోణాల్లో విచారణను నిశితంగా సాగించామని పేర్కొన్నారు. ఛార్జిషీటు తయారు చేయడానికి తొమ్మిది నెలల సమయం పట్టిందని, దాన్ని దాదాపు పది సార్లు సవరించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కేసుపై గంటల తరబడి ఫోకస్ చేయాల్సి వచ్చిందని, దర్యాప్తులో టెక్నాలజీని వినియోగించామని వివరించారు. ప్రణయ్ హత్య సమయంలో గేటుపై సమగ్రంగా అధ్యయనం చేసినట్టు తెలిపారు.

ప్రధాన నిందితుల్లో ఒకరైన శర్మ హత్య చేసిన రోజు బీహార్‌కు వెళ్లేందుకు రైలు ఎక్కాడని, ఆ రైలు దిగక ముందే అతడిని విమానంలో పోలీసులు వెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో చాలామంది వేర్వేరు రాష్ట్రాలకు పారిపోయారని, వారిని నాలుగు రోజుల వ్యవధిలో గుర్తించామని పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణల్ని పట్టించుకోకుండా నిజాన్ని బయటపెట్టేందుకు కృషి చేశామని అన్నారు.

మారుతీరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని రంగనాథ్ తెలిపారు. తన కూతురు తన అభీష్టానికి భిన్నంగా పెళ్లి చేసుకోవడం వల్ల ఒక తండ్రిగా ఆయన బాధపడటం సహజమని, ప్రతి తండ్రికీ తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన ఉంటుందని అన్నారు. అయితే, అలాంటి పరిస్థితుల్లోనూ వేరేవారి ప్రాణాలను తీయడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు.

ఈ హత్యకు పరువు హత్యతో పాటు ఆర్థిక కోణం కూడా ఉందని తెలిపారు. హత్యకు పాల్పడిన వారిలో తీవ్రమైన నేరచరితలు ఉన్న వ్యక్తులు ఉన్నారని, వారు వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసని పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా ఇలాంటి నిందితుల నెట్‌వర్క్‌ను గుర్తించడం ఆశ్చర్యానికి గురిచేసిందని రంగనాథ్ తెలిపారు.