వైసీపీకి కొరుకుడుపడని ఆ ఇద్దరూ !
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆ ఇద్దరు బడా నేతలు. దశాబ్దాలుగా రాజకీయ అనుభవం కలిగిన వారు. మంత్రులుగా పనిచేసిన వారు. ఆ ఇద్దరే ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం.
By: Tupaki Desk | 9 March 2025 9:00 PM ISTవైసీపీకి ఆ ఇద్దరూ ఏ విధంగా చూసినా కొరుకుడు పడడం లేదు. వైసీపీలో వారు ఉన్నారా లేదా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆ ఇద్దరు బడా నేతలు. దశాబ్దాలుగా రాజకీయ అనుభవం కలిగిన వారు. మంత్రులుగా పనిచేసిన వారు. ఆ ఇద్దరే ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం.
ఈ ఇద్దరూ వైసీపీలో 2014 ఎన్నికల ముందు చేరి 2024 దాకా ఎంతో చురుకుగా వ్యవహరించారు. ఈ ఇద్దరికీ 2014 నుంచి 2024 వరకూ మూడు సార్లు వైసీపీ అధినాయకత్వం టికెట్లు ఇచ్చింది. అయితే ఈ ఇద్దరూ 2019లో మాత్రమే గెలిచారు. అందుకు గానూ తమ్మినేని సీతారాం కి స్పీకర్ పదవి దక్కింది. ప్రసాదరావుకు కీలకమైన రెవిన్యూ శాఖతో మంత్రి పదవి లభించింది.
ఈ ఇద్దరు నేతలనూ వైసీపీ అధినేత జగన్ బాగానే చూసుకున్నారు. ఈ ఇద్దరూ వైసీపీలో బాగానే ఉన్నారు. అయితే 2024 ఎన్నికల తరువాత మాత్రం ఫుల్ సైలెంట్ అయ్యారు. ఈ ఇద్దరికీ ఒక్కటే ఆలోచన అని తెలుస్తోంది. తన కుమారులను రాజకీయ వారసులుగా తీర్చిదిద్దాలని వీరు చూస్తున్నారు.
అందుకోసం తగిన పార్టీ అన్వేషణలో ఉన్నారని ఈ కారణంగానే వైసీపీలో ఉంటున్నా అంటీముట్టనట్లుగానే ఉంటున్నారని అంటున్నారు. ఈ ఇద్దరిలో ప్రసాదరావుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి గా ఇస్తామని వైసీపీ చెప్పింది. అయినా కానీ పార్టీలో ప్రసాదరావు చురుకుగా ఉండటం లేదు. ఆయన జగన్ నిర్వహించే సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు.
ఇక మరో నేత ఆముదాలవలస నుంచి 2019లో ఎమ్మెల్యేగా నెగ్గిన తమ్మినేని సీతారాం ని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జిగా పార్టీ నియమించింది. ఆయన మాత్రం తనకు ఆముదాలవలస ఇంచార్జి పదవి కావాలని అంటున్నారని తెలుస్తోంది. అయితే ఆ పదవిని ఒక ద్వితీయ శ్రేణి నేతకు ఇచ్చారు. ఆయన 2024 ఎన్నికల్లో తమ్మినేని ఓటమిని కృషి చేశారని అందుకే ఆయనకు అధినాయకత్వం మీద విపరీతంగా కోపం ఉందని అంటున్నారు.
అయితే ఆయన దానిని బయటకు వ్యక్తం చేయకుండా మౌనం పాటిస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో ఆయన చేరాలని చూస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవి ఆగాయి. ప్రసాదరావు విషయంలోనూ అదే ప్రచారం ఉంది. ఆయన టీడీపీలో చేరుతారని అలాగే జనసేనలోకి వస్తారని అనుకున్నారు. అవేమీ జరగలేదు.
అయితే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి అప్పటికి ఆలోచించుకోవచ్చు అని ఈ ఇద్దరు నేతలు సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. వారు వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీ ఆదేశాలను పాటించడం లేదు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా తాజాగా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు శ్రీకాకుళం జిల్లాకు తొలిసారి వచ్చి పార్టీ పరిస్థితుల మీద మీటింగ్ పెడితే ఈ ఇద్దరు నేతలు గైర్ హాజర్ కావడం చర్చనీయాంశం అయింది.
ఈ ఇద్దరు నేతలూ పార్టీకి దూరంగా ఎందుకు ఉంటున్నారు అని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీలో అందరు నేతలూ వచ్చినా వీరు రాకపోవడం అనేక రకాలైన ఊహాగానాలకు తెర తీసినట్లు అయింది. జూనియర్ కి ఇన్చార్జి పదవి ఇచ్చారు కాబట్టి తాము హాజరు కాకూడదని భావించారా అన్నది కూడా చర్చగా ఉంది.
అయితే కన్నబాబు మాత్రం మీటింగ్ తరువాత ఈ ఇద్దరు నేతల ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడారని అంటున్నారు. మరి వారు ఏ రకంగా రియాక్టు అయ్యారో తెలియదు కానీ వైసీపీకి వీరికి మధ్య దూరం అయితే ఉందని మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ అధినాయకత్వం ఈ ఇద్దరి విషయంలో ఇంకా వేచి చూసే ధోరణితోనే ఉంది.
ఎందుకంటే ఈ ఇద్దరూ జిల్లాలో రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు. రాజకీయంగా మంచి అనుభవం కలిగిన వారు. అందుకే వీరి విషయంలో వైసీపీ హైకమాండ్ ఆచీ తూచీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఉన్న అసంతృప్తిని ఏమైనా కన్నబాబు కనుగొని దానిని హైకమాండ్ కి నివేదించి వారిని తిరిగి యాక్టివ్ అయ్యేలా చూస్తారా అన్నది చర్చగా ఉంది. ఆ పని ఆయన చేస్తే రీజనల్ కో ఆర్డినేటర్ గా సక్సెస్ అయినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.