పిల్లల కోసం హైదరాబాదీయుల ఆరాటం ఇంతనా?
కొన్ని సమస్యల గురించి పత్రికల్లో చదవటం.. టీవీ ఛానళ్లలో చూసినప్పుడు పెద్దగా ఎఫెక్టు ఉండకపోవచ్చు.
By: Tupaki Desk | 20 April 2024 4:55 AM GMTకొన్ని సమస్యల గురించి పత్రికల్లో చదవటం.. టీవీ ఛానళ్లలో చూసినప్పుడు పెద్దగా ఎఫెక్టు ఉండకపోవచ్చు. కానీ.. ఆయా అంశాలకు సంబంధించి రియల్ గా చూసినప్పుడు.. వామ్మో అనుకునేలాంటి పరిస్థితులు ఉంటాయి. తాజాగా అలాంటి సీన్ ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. పిల్లల కోసం తపించే కొత్త జంటల ఆరాటం ఎంత ఎక్కువగా ఉంది? పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. సంతాన భాగ్యం కోసం తపించే వారెంత మంది ఉంటారన్న దానికి సంబంధించిన శాంపిల్ ఒకటి తాజాగా హైదరాబాద్ మహానగరంలో బయటకు వచ్చింది.
రంగారెడ్డి జిల్లా చిలకూరు బాలాజీ టెంపుల్ లో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. సంతాన భాగ్యం లేని వారికి ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే పిల్లలు పుడతారన్న నమ్మకం ఉంటుంది. ప్రతి ఏటా నాలుగు రోజుల పాటు చిలుకూరు బాలాజీ టెంపుల్ లో నిర్వహిస్తుంటారు. అయితే.. ఈసారి సోషల్ మీడియాలోనూ.. చిట్టి వీడియోల్లోనూ ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వైరల్ గా మారాయి.
కట్ చేస్తే.. శుక్రవారం తెల్లవారుజాము మొదలు పెద్ద ఎత్తున జంటలు చిలుకూరు బాలాజీ టెంపుల్ వైపు బారులు తీరారు. శుక్రవారం ఉదయం పది గంటల వేళకు.. దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. కార్లు మొత్తం బారులు తీరాయి. దీంతో.. ప్రసాదం కోసం మండే ఎండల్లో ఐదారు కిలోమీటర్లు నడిచి మరీ ప్రసాదాన్ని సొంతం చేసుకోవాలని తపించిన వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ మహానగరంలో సంతానం కోసం ఆశగా ఎదురుచూసే వారు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారా? అన్నది చర్చగా మారింది.
కేవలం పది వేల మందికి మాత్రమే సరిపోయేంతగా ప్రసాదాన్ని సిద్ధం చేయగా.. ఉదయం 10 గంటలకే 70వేల మందికి పైగా భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో అప్పటికప్పుడు ఆ ప్రసాదాన్ని చేయించి.. మధ్యాహ్నం 12 గంటల వేళకు సుమారు 35 వేల మందికి ఇచ్చారు. ప్రసాదం అయిపోయిందని పోలీసులు చెప్పినప్పటికీ.. భక్తులు మాత్రం ఆగలేదు. చివరకు ఆలయ పూజారులు సైతం మైకుల్లో ప్రకటనలు చేసినా.. భక్తుల తాకిడి తగ్గలేదు. మొత్తంగా 1.5 లక్షల మంది గరుడ ప్రసాదం కోసం వచ్చినట్లుగా చెప్పారు.
భక్తుల భారీ రాకతో ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా దాదాపు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో.. వాహనదారులు మాత్రమే కాదు పోలీసులు సైతం ఎర్రటి ఎండలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రసాదం కోసం జరిగిన తొక్కిసలాటలో దాదాపు 50 మందికి పైగా భక్తులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో ఎఫెక్టు తో హైదరాబాద్ మహానగరంతో పాటు.. పలు జిల్లాల నుంచి కూడా సంతానాన్ని ఆశించే జంటలు రావటంతో ఇంతటి రద్దీ ఏర్పడిందంటున్నారు.