గెలుపు కోసం చమటోడుస్తున్న సీనియర్ మంత్రి !?
మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన రికార్డు కూడా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ఆయనకు ఉంది.
By: Tupaki Desk | 23 April 2024 3:50 AM GMTవైసీపీలో టాప్ సీనియర్ నేత ఒకరు గెలుపు కోసం ఏకంగా చమటోడుస్తున్నారు. ఆయనే ధర్మాన ప్రసాదరావు. ఆయనకు దాదాపుగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవిత అనుభవం ఉంది. పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన రికార్డు కూడా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ఆయనకు ఉంది.
అలాంటి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవిత చరమాంకంలో గెలుపు కోసం ఎన్నడూ లేని విధంగా శ్రమిస్తున్నారు అని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి 2019లో ధర్మాన ప్రసాదరావు గెలిచినా మెజారిటీ మాత్రం కేవలం 5,777 ఓట్లు మాత్రమే కావడం విశేషం. అది కూడా జగన్ వేవ్ లో ఆయన గెలిచారు.
ఇక అంతకు ముందు అంటే 2014లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి 24 వేల భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఈ రెండు మెజారిటీలను జాగ్రత్తగా తీసుకుంటే ఓడినపుడు భారీ తేడా ఉంది, గెలిచినపుడు తక్కువ మెజారిటీ వచ్చింది అంటేనే శ్రీకాకుళంలో సైకిల్ జోరు ముందు ధర్మాన స్పీడ్ సరిపోవడం లేదని అర్ధం అవుతోంది అంటున్నారు.
ఇక ఇపుడు చూస్తే ఆయన గెలుపు సులువు అని మొదట అనుకున్నారు. దానికి కారణం మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఫ్యామిలీకి టీడీపీ టికెట్ నిరాకరించడం దాని వల్ల అగ్గి రాజుకుంది. దాంతో పార్టీలో సంక్షోభం ఏర్పడిందని అది తనకు అనుకూలం అవుతుందని ధర్మాన వర్గం భావించారు అని అంటారు.
కానీ ఇపుడు చూస్తే సీన్ పూర్తిగా మారుతోంది. ఒక సర్పంచ్ గా మాత్రమే చేసిన గోండు శంకర్ అనే యువకుడిని టీడీపీ కోరి బరిలోకి దింపింది. ఆయన కొత్త ముఖం కావడంతో దూసుకుని పోతున్నారు. దానికి తోడు కింజరాపు కుటుంబం అండదండలు ఉన్నాయి.
మరో వైపు చూస్తే టీడీపీ అభ్యర్ధి ఎవరైనా ఓటేసేందుకు శ్రీకాకుళంలోని కీలక ప్రాంతాల ఓటర్లు రెడీగా ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో పట్టణ ప్రాంతాల ఓటర్లు ఎక్కువ.వారంతా వైసీపీకి యాంటీగా ఉన్నారని ఆ పార్టీ చేయించుకున్న సర్వేలలో తేలిందని అంటున్నారు.
అలాగే వ్యాపార వర్గాలు ఉద్యోగ వర్గాలు సైతం యాంటీగా ఉన్నారని, మధ్యతరగతి ప్రజానీకం కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. దాంతో ధర్మాన గెలుపు కోసం చాలా ప్రయాస పడుతున్నారు అని అంటున్నారు. ఈసారి గెలిస్తే హుందాగా రాజకీయాల నుంచి రిటైర్ కావాలని భావిస్తున్న పెద్ద మనిషికి ఇపుడు ఈ వయసులో ఒక యువకుడు తెగ టెన్షన్ పెడుతున్నారు అని అంటున్నారు. ధర్మాన చివరి అవకాశం అంటూ జనాల వద్దకు వెళ్తున్నారుట. మరి జనాల రియాక్షన్ తీర్పు ఈ విన్నపం మీద ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.