అనుకున్నదానికంటే ముందే వస్తున్న పీకే... ఇంటర్నల్ ఫైట్ స్టార్ట్!
ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిశోర్... తనకొచ్చిన క్రేజ్ తో నితీష్ కుమార్ వారసుడిగా జేడీయులోకి అడుగుపెట్టారు.
By: Tupaki Desk | 19 Oct 2024 9:53 AM GMTఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిశోర్... తనకొచ్చిన క్రేజ్ తో నితీష్ కుమార్ వారసుడిగా జేడీయులోకి అడుగుపెట్టారు. అయితే... అక్కడ పరిస్థితులను తట్టుకోలేకో ఎందుకో కానీ బయటకు వచ్చేశారు. దీంతో... వ్యూహాలు రచించినంత ఈజీకాదు రాజకీయాలు చేయడం అనే కామెంట్లు వినిపించాయి. దీంతో... కొన్నేళ్ల తర్వాత సొంతపార్టీ పెట్టుకున్నారు పీకే.
ఇందులో భాగంగా తొలుత జన సురాజ్ పేరుతో ఓ సంస్థను పెట్టి పాదయాత్రను చేశారు. అయితే.. దాన్ని మద్యలోనే ఆపేశారు. తర్వాత ఆ పేరునే పెడుతూ జన సురాజ్ పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ జన సురాజ్ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే.. అంతకంటే ముందే పోటీకి సిద్ధమవుతున్నారు!
అవును... వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎన్నికల్లో పోటీ చేస్తుంది ప్రశాంత్ కిశోర్ పార్టీ. అందుకు కారణమయ్యాయి.. బీహార్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు వచ్చిన ఉప ఎన్నికలు. తరాయ్, ఇమామ్ గంజ్, రామ్ గఢ్, బెలగంజ్ అనే నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది.
ఇందులో భాగంగా... ఈ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో... ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి జన సురాజ్ పార్టీ సిద్ధమవుతుందని అంటున్నారు. దీంతో... ఈ నాలుగు స్థానాలో ఈ పార్టీ చూపించే ప్రభావం ఆ పార్టీపై ప్రస్తుతానికి ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ప్రతిభించించిందని భావించొచ్చని అంటున్నారు పరిశీలకులు!
పార్టీ సమావేశంలో కుమ్ములాటలు!:
వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెలగంజ్ నియోజకవర్గంలో జన సురాజ్ నుంచి పోటీ చేయడానికి నాలుగు పేర్లను ప్రతిపాదించించారు. వీరిలో అమ్జద్ హసన్, డానిష్ ముఖియా, ప్రొ. ఖిలాఫత్ హుస్సేన్, ప్రొ. సర్ఫరాజ్ ఖాన్ లు ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన డానిష్ ముఖియా... అమ్జద్ హసన్ కు తన మద్దతు అని చెబుతూ తన పేరును ఉపసంహరించుకున్నారు.
ఇదే సమయంలో మరో ఫ్రొఫెసర్.. సర్ఫరాజ్ ఖాన్ కూడా తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. దీంతో.. ఇక అమ్జద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్ ల పేర్లు ఫైనల్ గా చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా స్పందించిన పీకే... బెలగంజ్ టిక్కెట్ ను ఖిలాఫత్ హుస్సేన్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో... ఒక్కసారిగా రచ్చ మొదలైంది.
ఇందులో భాగంగా... హుస్సేన్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్ ల మద్దతు దారులు కుమ్ములాటకు దిగారు. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఎంతవారించినా తన మాట వినకపోవడంతో.. పీకే అక్కడ నుంచి వెళ్లిపోయారు!