విజయ్ ను పవన్ ని చేసే దిశగా పీకే ప్రయత్నం!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాని పాలిస్తున్న డీఎంకే తనకు శత్రువులని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. తన నాయకత్వాన్ని స్వీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని కూడా ప్రకటించారు.
By: Tupaki Desk | 1 March 2025 3:52 AM GMTతమిళనాట రాజకీయాలు ఆసక్తిగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా తమిళ స్టార్ హీరో విజయ్.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించి, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో టీవీకే అధ్యక్షుడుకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ సూచన చేసినట్లు తెలుస్తోంది.
అవును... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాని పాలిస్తున్న డీఎంకే తనకు శత్రువులని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. తన నాయకత్వాన్ని స్వీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో... ఇటీవల విజయ్ ని ప్రశాంత్ కిశోర్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొన్ని సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... విజయ్ ని కలిసిన సమయంలో... శాశ్వత ఓటు బ్యాంకు కలిగి ఉన్న అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేస్తేనే డీఎంకేను నిలువరించడం సాద్యమవుతుందని పీకే చెప్పినట్లు కథనాలొస్తున్నాయి. ఈ విషయంపై అన్నాడీఎంకేతోనూ పీకే మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో విజయ్ రాజీపడటం మంచిదని చెప్పారని అంటున్నారు.
ఇదే సమయంలో... అన్నాడీఎంకేకు ప్రస్తుతం కనీసం 25 శాతం ఓట్లు ఉంటాయని.. టీవీకేకు అత్యధికంగా 20 శాతం వచ్చే అవకాశం ఉందని.. ఇదే సమయంలో ఈ కూటమిలో ఇతర పార్టీలనూ చేర్చుకుంటే మొత్తం ఓట్ల శాతం 50కి చేరే అవకాశం ఉందని విజయ్ కు ప్రశాంత్ కిశోర్ చెప్పారనే చర్చ ఇప్పుడు తమిళనాట మొదలైందని తెలుస్తోంది.
పైగా... సీఎం కావాలని భావిస్తున్న విజయ్ కి ఏపీ రాజకీయాలను ఉదహరించారట ప్రశాంత్ కిశోర్. ఇందులో భాగంగా... 2019లో పవన్ కల్యాణ్ ఇబ్బంది పడినా.. 2024లో చంద్రబాబుతో జత కట్టి విజయం సాధించారని చెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా... పళనిసామిని సీఎం, విజయ్ డిప్యూటీ సీఎం అని ఒప్పందం చేసుకోవచ్చని సూచించారని అంటున్నారు!
దీంతో ఈ విషయం తమిళనాట రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా.. ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఉమ్మడి శత్రువును ఓడించేందుకు విజయ్ కొన్ని రాజీలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా... టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున నేతృత్వంలో 2026 ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ప్రశాంత్ కిశోర్ టీవీకేతో జతకట్టినట్లు చెబుతోన్న సంగతి తెలిసిందే.