ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ ఎలక్షన్... తెరపైకి ఆసక్తికర ఫలితం!
ఈ సమయంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆసక్తికర ఫలితాలు దక్కాయి.
By: Tupaki Desk | 23 Nov 2024 10:42 AM GMTతెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రశాంత్ కిశోర్ పేరు సుపరిచితమే. రాజకీయ వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు! ఈ క్రమంలో జన సురాజ్ ఉద్యమాన్ని స్థాపించి.. అనంతరం దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. ఈ సమయంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆసక్తికర ఫలితాలు దక్కాయి.
అవును... రాజకీయ వ్యూహకర్తగా పరిచయం ఉన్న ప్రశాంత్ కిశోర్ గత నెల మొదట్లో బీహార్ లో జరిగిన బహిరంగ సభలో "జన్ సురాజ్ పార్టీ" ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని తెలిపారు.
ఈలోపు ఇటీవల బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ పోటీకి తన అభ్యర్థులను నిలబెట్టారు. ఇందులో భాగంగా... తరారీ, రాంగఢ్, బేలాగంజ్, ఇమాంగంజ్ నియోజకవర్గాల్లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే అనూహ్యంగా నాలుగు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు.
ఈ క్రమంలో పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ మూడు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులు.. ఒక స్థానంలో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. వీటిలో ఒకటి మినహా మిగిలిన మూడు స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. దీంతో... రాష్ట్రంలో రాజకీయ రంగంలో తుఫాను సృష్టిస్తారనే వాదనలు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని అంటున్నారు!
ఇక ఈ నాలుగు స్థానాల్లోనూ రెండు (తరారీ, రాంగఢ్) బీజేపీ, ఒకటి (బేలాగంజ్) జేడీయూ, ఒకటి (ఇమాంగంజ్) హెచ్.ఎం.ఏ.(ఎస్)లు గెలుచుకున్నాయి.