అటు దీక్ష.. ఇటు లగ్జరీ వ్యాన్.. పీకే ఇదేం దీక్షయ్య బాబూ..
ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే దీక్షపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 4 Jan 2025 1:30 PM GMTప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే దీక్షపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. బిహార్ నిరుద్యోగులకు అండగా ఆయన చేస్తున్న నిరవధిక నిరశన దీక్ష శిబిరం పక్కన లగ్జరీ వ్యాన్ ఉండటాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రశాంత్ కిషోర్ ఆరోపిస్తున్నారు. ఆ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పట్నాలోని గాంధీ మైదానులో మహాత్మాగాంధీ విగ్రహం ముందు పీకే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ దీక్ష శిబిరం పక్కనే ఒక లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్ రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే వాహనం దీక్ష శిబిరం ఎందుకుందని ప్రతిపక్షాలు నిలదీస్తుండగా, నెటిజన్లు పీకేపై రకరకాల పోస్టులు చేస్తున్నారు.
పీకే దీక్షపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీలు, నెటిజన్లు వ్యాఖ్యానాలు చేయడాన్ని జనసురాజ్ పార్టీ ఆక్షేపించింది. ఆ వ్యాన్ అక్కడ ఉండటం సమస్యే కాదని, అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ప్రతి విమర్శలు చేస్తోంది. ఇక్కడ పట్టించుకోవాల్సిన అసలు విషయం విద్యార్థుల భవిష్యత్తు. పీకే ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే లగ్జరీ వ్యాన్ ఉందంటూ సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని జన సురాజ్ పార్టీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా, బిహార్లో తన అదృష్టం పరీక్షించుకుందామని పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ నిరుద్యోగులకు మద్దతుగా నిరశన దీక్షకు దిగారు. పరీక్షను రద్దు చేసి కొత్తగా మళ్లీ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగుల డిమాండ్ నెరవేరేవరకు నిరాహార దీక్ష చేస్తానంటూ పీకే స్పష్టం చేస్తున్నారు.