Begin typing your search above and press return to search.

ఒక్క ఎన్నికలో సలహాలిస్తే ఫీజు రూ.100 కోట్లు.. పీకే హాట్ కామెంట్స్!

2019 ఎలక్షన్స్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (పీకె) పేరు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Nov 2024 4:55 AM GMT
ఒక్క ఎన్నికలో సలహాలిస్తే ఫీజు రూ.100 కోట్లు.. పీకే హాట్  కామెంట్స్!
X

ఇటీవల కాలంలో ప్రజలకు సేవచేయడానికి ఎన్నికల్లో పాల్గొనడానికి రాజకీయ నాయకులు చాలామంది వ్యూహకర్తలపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే! ఎన్నికల సమయం వచ్చిందంటే ఈ వ్యూహకర్తల హడావిడి కాస్త తీవ్రంగానే ఉంటున్న పరిస్థితి! దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.

ఆ సంగతి అలా ఉంటే.. 2019 ఎలక్షన్స్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (పీకె) పేరు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. ఈ క్రమంలో తాను ఒక ఎన్నికలో సలహాలు ఇస్తే ఫీజు రూ.100 కోట్లకు పైగా వసూలు చేస్తానని చెప్పారు పీకె.

అవును... ఎన్నికల వ్యూహకర్తగా తాను ఏదైన రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలిచ్చేందుకు రూ.100 కోట్లకు పైగా ఫీజు వసూలు చేస్తానని జన సూరజ్ కన్వీనర్ ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. బీహార్ లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా బెలగంజ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మైకందుకున్న ప్రశాంత్ కిశోర్... తన ప్రచారాలకు ఎలా నిధులు సమకూరుస్తారనే విషయాన్ని ప్రజలు తరచుగా తనను అడుగుతుంటారని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలలో పది ప్రభుత్వలు తన వ్యూహాలపై నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా.. తన ప్రచార కార్యక్రమాల్లో టెంట్లు, స్టేజ్ లు వేయడానికి తన దగ్గర డబ్బు సరిపోదని అనుకుంటున్నారా.. తాను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా అని ప్రశ్నించిన పీకే... తాను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తె రూ.100 కోట్లు, లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటానని.. వాటితోనే తన ఎన్నికల ప్రచారాలకు నిధులు సమకూర్చుకో గలుగుతున్నానని అన్నారు.

కాగా... బీహార్ లో నవంబర్ 13న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో పోటీ చేయడానికి జన సూరజ్ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో భాగంగా.. బెలగంజ్ నుంచి మహ్మద్ అంజాద్.. ఇమాంగంజ్ నుంచి జితేంద్ర, రాంగఢ్ నుంచి సుశీల్, తరారీ నుంచి కిరణ్ సింగ్ బరిలోకి దిగారు!