తమిళ రాజకీయాల్లో పెను సంచలనం? దళపతికి పీకే మాస్టర్ స్కెచ్
తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకు సహాయం చేయాల్సిందిగా విజయ్ పీకేను కోరినట్లు సమాచారం.
By: Tupaki Desk | 10 Feb 2025 4:33 PM GMTప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు డిమాండ్ తగ్గడం లేదు. తన వృత్తికి విశ్రాంతినిచ్చేసినట్లు పీకే చెబుతున్నా, పొలిటికల్ పార్టీలు మాత్రం ఆయనను వదలడం లేదు. ఇటీవలే ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేశ్ తో భేటీ అయిన పీకే.. తాజాగా తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ హీరో దళపతి విజయ్ తో భేటీ అయ్యారు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకు సహాయం చేయాల్సిందిగా విజయ్ పీకేను కోరినట్లు సమాచారం.
సర్కార్ సినిమాలో పీకే పాత్రను పోషించిన దళపతి విజయ్ తన రాజకీయ జీవితంలో పీకే సాయం కోరినట్లు తెలుస్తోంది. గతంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ విజయానికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కు ఆ రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉంది. దీంతో పీకే ను తాను ఎంగేజ్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సక్సెస్ అవుతానని దళపతి విజయ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పీకే సలహా ప్రకారం త్వరలో తమిళనాడులో బస్సు యాత్ర లేదా పాదయాత్ర చేసేందుకు దళపతి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాజకీయాల్లో వర్క్ అవుట్ అయిన పాదయాత్రను తమిళనాట పరిచయం చేయాలని పీకే చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించిన దళపతి విజయ్ ఈ మధ్యే ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇక వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా జరుగుతున్న రాజకీయాన్ని తనవైపు టర్న్ చేయాలని లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు దళపతి. మరోవైపు బీజేపీ కూడా తమిళనాడులో ఎదగాలని చూస్తోంది. ఈ పరిణామాల మధ్య పీకే ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
దేశంలోనే టాప్ మోస్ట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా పీకే గుర్తింపు తెచ్చుకున్నారు. ఐ ప్యాక్ సంస్థను ప్రారంభించి దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు విజయాలను అందించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ కోసం పనిచేసిన పీకే బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ, త్రుణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు సేవలందించారు. ఏపీలో గత ఎన్నికల ముందు టీడీపీకి ఆయన సహకరించారని అంటారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ లను ఆయన ప్రత్యేకంగా కలిశారు. కాగా, తన సొంత రాష్ట్రం బిహార్ లో రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్న పీకే.. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. కానీ, ఆయన సేవలను కోరుకుంటున్న నేతలు మాత్రం.. తాను తన వృత్తికి దూరంగా ఉన్నానని చెబుతున్నా వదలడం లేదు.