Begin typing your search above and press return to search.

జమిలి వెనుక భారీ వ్యూహం... ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు!

అవును... కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జమిలీ ఎన్నికల జపంపై సుప్రీంకోర్టులో ప్రఖ్యాత లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన విషయాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 1:07 PM GMT
జమిలి వెనుక భారీ వ్యూహం... ప్రశాంత్  భూషణ్  సంచలన వ్యాఖ్యలు!
X

గతకొన్ని రోజులుగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో "ఒకే దేశం - ఒకే ఎన్నికలు" పేరుతో కేంద్రం కొత్త చర్చకు తెరలేపింది. ఇలా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీ ఎత్తున డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పుకొస్తుంది. ఈ సమయంలో ప్రశాంత్ భూషణ్ కీలక వివరాలు వెల్లడించారు.

అవును... కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జమిలీ ఎన్నికల జపంపై సుప్రీంకోర్టులో ప్రఖ్యాత లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఎన్నికల వల్ల డబ్బు, సమయం ఆదా అవ్వడం కాదు.. దీని వెనుక భారీ స్కెచ్ ఉందని, ఈ నిర్ణయం దేశం కోసం కాదు బీజేపీ కోసం అనే అర్ధమొచ్చేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఈ ఏడాదిలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేందుకే జమిలీ ఎన్నికల పేరుమీద కుట్ర జరుగుతోందని ఆయన తాజా ఆరోపించారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో రాష్ట్రాలున్న నేపథ్యంలో.. మధ్యలో ఓ ప్రభుత్వం మెజార్టీ కోల్పోతే కుప్పకూలుతుందని, అటువంటప్పుడు జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ఎలాంటి లాభం ఉండబోదని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు.

ఇదే సమయంలో దేశం మొత్తం ఏకకాలంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పుడు కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని.. అది ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే భారతదేశం ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్ష తరహా పాలన వైపు మళ్లాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదని గుర్తుచేసిన ప్రశాంత్ భూషణ్... ఆ విషయం తెలిసీ జమిలి ఎన్నికల వ్యూహానికి కేంద్రం తెరలేపుతోందని విమర్శించారు. ఇదే సమయంలో ఈ ఏడాది చివర్లో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో గెలుపుపై బీజేపీకి నమ్మకం లేకపోవడం వల్లే అక్కడ ఎన్నికలు వాయిదా వేసి సార్వత్రిక ఎన్నికలతో కలిపేయాలని చూస్తుందని తెలిపారు.

కాగా... ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... మణిపూర్ తో పాటు ఈ మధ్యకాలంలో దేశంలో జరిగిన ఘోర సంఘటనల నేపథ్యంలో... ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదని ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారని తెలుస్తుంది.

అలాగని ఈ ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలపై పడటం ఖాయం కాబట్టి... ఎలాగైనా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ప్రశాంత్ భూషణ్ దుయ్యబట్టారు. వారి ఎన్నికల భయంవల్ల దేశం అధ్యక్ష ఎన్నికలవైపు మళ్లే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.