పీకేను నమ్మొచ్చా.. విశ్వసనీయ ఎంత?
సరే.. ఆయన చెప్పేది నిజమోకాదో అనేదే ఇప్పుడు సందేహంగా మారింది.
By: Tupaki Desk | 8 April 2024 8:45 AM GMTఎన్నికల మాజీ వ్యూహకర్త.. బీహార్‌కు చెందిన విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్.. గత మూడు మాసాలుగా రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వంపైనా సీఎం జగన్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగు తున్నారు. నోరు విప్పితే.. వైసీపీ మరోసారి అధికారంలోకి రాదని.. సీఎం జగన్ ఆ పదవిని వదులు కోవడ మేనని అంటున్నారు. ప్రజలను సోమరులను చేశాడని కొన్ని రోజులు చెప్పారు. కేవలం ఉచితాలతోనే ఎన్నికల్లో నెగ్గలేరని కొంత సేపు ఇలా.. తనదైన శైలిలో అవకాశం వచ్చినప్పుడల్లా పీకే చెబుతున్నారు.
సరే.. ఆయన చెప్పేది నిజమోకాదో అనేదే ఇప్పుడు సందేహంగా మారింది. ఎందుకంటే.. ఒక వ్యక్తి తన విశ్వసనీయతను ఒక్కసారి పోగొట్టుకుంటే.. ఆ తర్వాత.. ఆయనను నమ్మడం అనేది కష్టం. ఇప్పుడు ఇదే పీకే విషయంలోనూ చోటు చేసుకుంది. జాతీయస్థాయిలో ఇప్పుడు పీకేతో కలిసి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కొన్నాళ్ల కిందట అలిగి.. అసలు తాను ఎవరికీ పనిచేయనని చెప్పారు. దీనికి కారణం.. గోవా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు పనిచేసిన పీకే పెద్ద వివాదం రేపారు.
కాంగ్రెస్‌కు పనిచేసిన ఆయన సొమ్ముల వివాదం రేపుకొని.. మధ్యలోనే హ్యాండిచ్చారు. ఇక, మమతా బెనర్జీ తోనూ.. ఆయన పశ్చిమ బెంగాల్‌లో పనిచేసి.. లోపాయికారీగా.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఇదే సుబేందు అధికారి.. మమతను వీడి వెళ్లిపోవడానికి కారణమైంది. ఇక, కేసీఆర్‌తో పనిచేసేందుకు వచ్చిన ఆయనకు.. బీజేపీతో సంబంధాలు తెగిపోలేదని గుర్తించిన కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే ఆయనను పక్కన పెట్టారు. అంటే.. మొత్తగా.. పీకే తన విశ్వసనీయతను కొన్నాళ్ల కిందటే కోల్పోయారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో జగన్ కోసం పీకే పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన ఉచితాలు ప్రవచించారు. మేనిఫెస్టోను రూపొందించడం కోసం.. ఢిల్లీలో కూర్చుని మరీ.. మంతనాలు చేశారు. అలాంటిది ఇప్పుడు అవే మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్న జగన్ను విమర్శించడం.. ఎంత వరకు సమంజసం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
" ప్రశాంత్ కిశోర్ సహకారం లేకపోతే.. మేనిఫెస్టోలో చాలా అంశాలు మిస్సయ్యేవాళ్లం" అని ప్రచారం అయిపోయిన తర్వాత.. జగన్ చెప్పిన విషయం నీకు తెలియదా? అనేది ప్రశ్న. ఇవన్నీ చేసి.. ఇప్పుడు తీరిగ్గా.. ఆయనకు వ్యతిరేక ప్రకటనలు చేస్తే... నమ్మేదెవరు? అసలు నీ విశ్వసనీయతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన తర్వాత.. నువ్వు ఏం చెప్పినా.. అనేక సందేహాలు దాని చుట్టూ ముసుకున్నాయి. ముందు నీ విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేయ్యి స్వామీ!``- అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.