Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికల ఫలితాలపై పీకే తాజా వ్యాఖ్యలు!

ఎన్నికల ఫలితాలపై పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   20 May 2024 4:47 AM GMT
ఏపీ ఎన్నికల ఫలితాలపై పీకే తాజా వ్యాఖ్యలు!
X

ఎన్నికల ఫలితాలపై పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో..ఆయనతో ప్రముఖ టీవీ చానళ్లు ఒకరు తర్వాత ఒకరు చొప్పున ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు పీకే. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏ కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలపైనా ఆయన స్పందించారు. ప్రశ్న ఏదైనా సూటిగా సమాధానం చెప్పేశారు. ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనేం చెప్పారన్న అంశాల్ని చూస్తే..

ఏపీ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అధికార వైసీపీకి ఓటమి ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. మరి.. తాము గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలవనున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తున్నారు కదా? అని ప్రశ్నించగా స్పందించిన పీకే.. ‘‘తాము ఎన్నికల్లో గెలవనున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఆయన మాదిరే రాహుల్ గాంధీ.. తేజస్వి యాదవ్.. అమిత్ షాలు కూడా చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నికల్లో పని చేస్తున్న నాకు ఏ ఎన్నికల్లో అయినా సరే.. ఫలితాల లెక్కింపునకు ముందుగా ఓటమిని ఒప్పుకున్న వారు ఎవరైనా ఉన్నారా?’’ అని ప్రశ్నించారు.

అంతేకాదు.. ఓట్ల లెక్కింపు వేళ కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తారన్నారు. ఓట్ల లెక్కింపు వేళ.. నాలుగు రౌండ్ల లెక్కింపు తర్వాత కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేయటం చూడొచ్చన్న పీకే.. ‘‘ఎన్నికల్లో గెలుస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం గతం కంటే ఎక్కువ సీట్లలో గెలవనున్నట్లు చెప్పారు. ఈ చర్చకు అంతం ఉండదు’’ అంటూ తన అభిప్రాయాన్ని తేల్చేశారు.

ఏపీలో కూటమి గెలుపు ఖాయమన్న పీకే.. జాతీయ స్థాయిలో బీజేపీకి తిరుగు ఉండదని స్పష్టం చేశారు. గత ఎన్నికలతో (2109) పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలు లేవని.. ఈసారి 2019 నాటి సీట్లు కానీ.. అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే వీలుంది’’ అంటూ తన అంచనాను వెల్లడించారు. జాతీయస్థాయిలో బీజేపీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఎక్కువ సీట్లు వస్తాయన్న పీకే అంచనా ఆసక్తికరంగా మారింది. మరి.. ఆయన అంచనా ఏ మేరకు నిజం కానున్నాయన్నది తేలాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు.