సైకిల్ రిపేరుకు పీకే నో...!?
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తోంది
By: Tupaki Desk | 19 Dec 2023 12:30 AM GMTఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తోంది. టీడీపీకి ఈసారి ఎన్నికలు డూ ఆర్ డై గ ఉంటాయని వేరేగా చెప్పాల్సింది లేదు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఈసారి ఎన్నికలు చంద్రబాబుకు సైతం దాదాపుగా ఆఖరివి అని చెప్పుకోవాలి.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతోంది. అధికార వైసీపీని గద్దె దించడమే ఏకైక ధ్యేయంగా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోతోంది. జనసేన పవన్ కళ్యాణ్ తో సీట్ల సర్దుబాటుని కూడా ఒక కొలిక్కి తెచ్చిన తెలుగుదేశం పార్టీ ఏపీలో మహా కూటమిని ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంచితే టీడీపీకి చంద్రబాబు అతి పెద్ద మాస్టర్ మైండ్ అన్నది తెలిసిందే. కానీ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మరింతమంది వ్యూహకర్తలను కూడా టీడీపీ విపక్షంలోకి వచ్చిన తరువాత నియమించుకుని వారి సేవలను పొందుతోంది. ఈ క్రమంలో రాబిన్ శర్మ టీడీపీకి వ్యూహకర్తగా సేవలు అందిస్తున్నారు.
ఆయన పీకే శిష్య బృందంలో కీలకమైన వారు. ఉత్తరాదిన ప్రశాంత్ కిశోర్ తో కలసి అనేక ఎన్నికలలో వ్యూహాలను రచించిన అనుభవం ఉన్నారు. ఇక్ రాబిన్ శర్మ టీడీపీకి వ్యూహకర్తగా సేవలు అందించిన తరువాత ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అని ఒక కార్యక్రమం డిజైన్ చేశారు. అలాగే బాబుతోనే భవిష్యత్తు అంటూ కార్యక్రమాలు ఇచ్చారు.
ఇవన్నీ కూడా ఒక మోస్తరుగానే జనంలోకి వెళ్లాయి. ఇక బాదుడే బాదుడు అంటూ పెరిగిన ధరల మీద కూడా రాబిన్ శర్మ ఇచ్చిన కార్యక్రమం అంతగా సక్సెస్ కాలేదు. దానికి కారణం ధరలు ఎపుడూ పెరుగుతూనే ఉంటాయి. అవి అన్ని చోట్లా పెరుగుతూనే ఉంటాయి. టీడీపీ హయాంలోనూ పెరిగాయి. దాంతో అది పెద్దగా రక్తి కట్టలేదు
ఈ నేపధ్యంలో ప్రశాంత్ కిశోర్ సేవలను వాడుకోవాలని టీడీపీ ఆలోచిస్తోంది అని వార్తలు వచ్చాయి. ఆ మధ్యన చంద్రబాబు అరెస్ట్ అయినపుడు ఢిల్లీలో ఎక్కువ కాలం గడపిన లోకేష్ పీకేతో భేటీ అయ్యారు అని కూడా ప్రచారం సాగింది. ఇక బాబు జైలు బయటకు వచ్చిన తరువాత కూడా పీకేతో సమావేశం అయి మాట్లాడారు అని అంటున్నారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపధంలో నడిపించాలని పీకేని టీడీపీ పెద్దలు కోరినట్లుగా ప్రచారం అయితే ఉంది. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో అతి తక్కువ టైంలో టీడీపీని పట్టాలెక్కించడం సాధ్యం కాదని పీకే చెప్పినట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. వైసీపీ గత రెండేళ్ళుగా జనంలో ఉందని, దాని కంటే ఎక్కువగా ఆ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి వెళ్ళాయని దాంతో వైసీపీని వీక్ చేయడం ఒకింత కష్టం అన్నట్లుగా పీకే తన సందేహాలను వెలిబుచ్చినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.
మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకూ ఉన్నాయో తెలియదు కానీ పీకే సేవలు టీడీపీకి అంటూ వచ్చిన వార్తలు జరుగుతున్న ప్రచారంలో నిజాలు సగమే అని అంటున్నారు. సో రేపటి ఎన్నికలలో సంక్షేమ పధకాలు వైసీపీకి ఆయుధాలు అని పీకే ఇప్పటికీ భావిస్తున్నారా అన్న సంగతి తేలాలీ అంటే ఎన్నికల ఫలితాల దాకా ఎదురుచూడాల్సిందే.