అసలు అవినీతి ఓటర్లేదట... పీకే సుద్దులు.. విన్నారా?!
ఉరఫ్ పీకే తాజాగా దేశంలోని ఓటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 17 Sep 2023 3:15 AM GMTరాజకీయ వ్యూహకర్తగా ఈ దేశ నేతలకు, ప్రజలకు పరిచయం అయిన ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ పీకే తాజాగా దేశంలోని ఓటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఓటర్లకు కొన్ని నీతులు కూడా చెప్పారు. ఓటర్లను అవినీతి పరులుగా ఆయన ప్రకటించారు. ''ఓటు వేసేందుకు రూ.500 లంచం తీసుకుంటున్న ఓటర్లకు నేతలు నిజాయితీగా ఉండాలని కోరుకునే హక్కు ఎలా వస్తుంది. ఇది అన్యాయం. ముందు వారు ఓటు వేసేందుకు లంచం తీసుకోవడం మానేయాలి'' అని సుద్దులు చెప్పారు.
"యథాప్రజా...తథా నేత.. ప్రజలు అవినీతిపరులైతే నేతలు హరిశ్చంద్రులవుతారా?'' అని పీకే ప్రశ్నించారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన పీకే.. డబ్బులకు అమ్ముడుపోయి ఓటేయడమే ఈ దేశంలో ఓటర్లను అవినీతి పరులను చేసిందన్నారు. ''దేశంలో ఓటుకు నోటు తీసుకునే తొలి అవినీతి పరుడు ఓటరే. ఇలా చేసిన వారికి నేతలను ప్రశ్నించే హక్కు ఉండదు'' అని అని వ్యాఖ్యానించారు. ''రూ.500లకు ఓటును అమ్ముకుని నేతతను మాత్రం హరిశ్చంద్రుడుగా ఉండమనడం అన్యాయం'' అంటూ తనదైన శైలిలో అన్నారు.
ఓటరు అవినీతిపరుడైతే రాజకీయనేతలూ అవినీతిపరులు కాకుండా ఎలా ఉంటారంటూ నేతలను సమర్థించే ప్రయత్నం చేశారు. ''500 రూపాయలకు ఓటు అమ్ముకుంటే మీ నేత మీ గౌరవ మర్యాదలను రూ.5 వేలకు అమ్ముకుంటాడు. చికెన్ బిర్యానీకి, మద్యం బాటిల్ కి ఓటేసేవారికి నేతలను నిలదీసే అధికారం లేదు. సమాజం ఎలా ఉంటే నేతలూ అలానే ఉంటారు'' అని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. ఓటేయడానికి నేతలు డబ్బులిచ్చినప్పుడు ఉచిత ప్రభుత్వ పథకాలకూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారని ముక్తాయించారు. ''ప్రజలు మాత్రం దొంగలుగా ఉండి నేతలను మాత్రం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకోవడం సరికాదు'' అని పీకే చెప్పారు.
కట్ చేస్తే.. ఏపీలో 2019లో జరిగిన ఎన్నికలకు వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే.. ఎన్నికల్లో డబ్బుల పంపిణీని ప్రోత్సహించారనే వార్తలు వచ్చాయి. దీంతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయల మేరకు ప్రజలకు పంపిణీ చేసిన వార్తలు కూడా రావడం గమనార్హం. ఇక, బిహార్‌లోనూ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే.. అక్కడ కూడా ఇదే వెలగబెట్టారనే విమర్శలు జాతీయ స్థాయిలో వినిపించాయి. మరి ఆయనే ప్రోత్సహించిన ఈ లంచాల సంస్కృతి.. ఇప్పుడు ఆయనను బాధించడం చిత్రంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.