Begin typing your search above and press return to search.

సంచలనంగా మారిన పీకే ప్రత్యేక ఇంటర్వ్యూ!

తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లను సాధించిన వైసీపీకి ఈసారి 51 సీట్లు కూడా రావు.

By:  Tupaki Desk   |   13 May 2024 5:53 AM GMT
సంచలనంగా మారిన పీకే ప్రత్యేక ఇంటర్వ్యూ!
X

ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగటానికి ఒక రోజు ముందు (ఆదివారం) ఒక తెలుగు టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్యుల్లోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుండటం.. ఎవరివైపు ఓటర్లు మొగ్గు చూపుతారు? అన్నదిప్పుడు ఉత్కంటగా మారిన వేళ.. సీన్లోకి వచ్చిన పీకే పలు అంశాల మీద తన అభిప్రాయాల్ని వెల్లడించారు.

పీకే వెల్లడించిన అంశాలు రాజకీయ వర్గాల్లోనే కాదు.. ప్రజల్లోనూ చర్చకు తెర తీశాయి. ఆయనేం చెప్పారు? ఎన్నికల వేళ ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాల్ని వెల్లడించారు? అన్నది చూస్తే..

- తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లను సాధించిన వైసీపీకి ఈసారి 51 సీట్లు కూడా రావు.

- కూటమికి అనుకూలంగా వచ్చే ఓట్ల కంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ ఉండనుంది. 2019కి ముందున్నపరిస్థితులు జగన్ కు అనుకూలంగా లేవు.

- నేను ఐప్యాక్ లో ఉన్నప్పుడు 2019లో వైసీపీకి పని చేశా. అప్పుడు ఆ పార్టీకి నవరత్నాలు అనే స్కీం డిజైన్ చేశా. అక్కడితో నా పని పూర్తైంది. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. జగన్ అధికారంలోకి వచ్చారు.

- ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయాలతోనూ నాకు సంబంధం లేదు. జగన్ గెలుపు కోసం అప్పట్లో తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిల రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు వారి విశ్వాసాన్ని కూడా కోల్పోయారు.

- ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నన్నుపదే పదే అమ్ముడుపోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ కు ఆయన తల్లి విజయమ్మ కూడా మద్దతు తెలపలేదు. అంటే.. ఆమె కూడా తెలుగుదేశంకు అమ్ముడు పోయినట్లేనా?

- విజయమ్మకు తెలుగుదేశం పార్టీ ఎన్ని కోట్లు ఇచ్చింది? నేను కష్టపడి పని చేయటం ద్వారా 2019లో జగన్ 151 సీట్లతో విజయం సాధించారు. నా పట్ల జగన్ కృతఘ్నతతో వ్యవహరించారు. అందుకు ప్రతిగా ఈసారి 51 సీట్లు వస్తాయి.

- ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని తాను చెప్పిన కారణంగా నన్ను చంద్రబాబుకు అమ్ముడుపోయారంటూ బొత్స వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు బొత్స ఎక్కడున్నారు? బొత్స లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా జగన్ సర్వం కోల్పోతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబానికి అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోతే ఆయనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నా దగ్గర అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి.