Begin typing your search above and press return to search.

పీటీఐ ఇంటర్వ్యూలో పీకే చెప్పిన షాకింగ్ సంగతులేంటి?

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   8 April 2024 6:29 AM GMT
పీటీఐ ఇంటర్వ్యూలో పీకే చెప్పిన షాకింగ్ సంగతులేంటి?
X

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ వ్యూహకర్తగా.. ఎన్నికల స్ట్రాటజిస్టుగా సేవలు అందించే ఆయన తాజాగా ప్రముఖ మీడియా సంస్థ పీటీఐకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు విజయాన్ని సాధిస్తారు? తాను చెబుతున్న అంచనాలకు సంబంధించిన లాజిక్కుతో పాటు.. పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు.

400 సీట్లకు గురి పెట్టిన మోడీ అండ్ కో ఆశలు ఎంతమేర నెరవేరతాయన్న అంశంతో పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇంతకూ పీటీఐ ఇంటర్వ్యూ వేళ పీకే ఏం చెప్పారు? అన్న విషయంలోకి వెళితే..

తెలంగాణ

- తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో గణనీయంగా ఓట్లు.. సీట్లు సాధిస్తుంది.

- తెలంగాణలో సీట్ల సాధనలో బీజేపీ మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

- తెలంగాణలో బీజేపీ సాధించే సీట్లు.. ఓట్లు అధికంగా ఉంటాయి. ఇది చాలా పెద్ద విషయం.

ఏపీ

- జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావటం కష్టమే.

- జగన్ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చే నాయకుడిలా కాకుండా ఓటర్లకు ఒక ప్రొవైడర్ లా వ్యవహరిస్తున్నారు.

- జగన్ తీరు గతకాలపు మోనార్కులను తలపిస్తోంది.

- ఛత్తీస్ గఢ్ గత ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మాదిరి ప్రజలకు డబ్బు పంచటానికే జగన్ పరిమితం అయ్యారు.

- ఏపీలో డెవలప్ మెంట్ లేదు.

- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు ప్రజలకు డబ్బులు ఇవ్వటమే కాదు. వారి ఆకాంక్షలను నెరవేర్చాలి.

- నేను రాజును. మీకేం కావాలో నాకు తెలుసు. అది మీకు ఇస్తున్నా కాబట్టి నాకు ఓట్లేయండని అనుకుంటే కుదరదు. జగన్ తీరు ఇదే.

- నేను డబ్బులు పంచుతూ పోతుంటా. మీకిదే మంచిది. రోడ్లు వేసినా వేయకున్నా.. రాజధాని ఉన్నా లేకున్నా.. ఫ్యాక్టరీలు కట్టినా కట్టకున్నా.. నెలకు రూ.2వేలు ఇస్తుంటానని ఆయన భావిస్తున్నారు.

- నగదు బదిలీ ద్వారా ప్రజలకు జగన్ డబ్బులు ఇచ్చారు. కానీ.. ఉద్యోగాలుకల్పించటానికి.. రాష్ట్ర అభివ్రద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

బీజేపీ

- ఏప్రిల్ 19 నుంచి మొదలయ్యే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300లకు పైగా సీట్లు సాధిస్తుంది.

- ఆ పార్టీ పెట్టుకున్న 370 సీట్ల లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు.

- బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు విపక్షాలకు గతంలో పలు అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేదు.

- దేశంలో 543 ఎంపీ స్థానాలకు.. తూర్పు దక్షిణాది రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్.. ఒడిశా.. బిహార్.. తెలంగాణ.. తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్.. కేరళ రాష్ట్రాల్లో 204 సీట్లు ఉన్నాయి. వీటిల్లో 2014లో బీజేపీ గెలుచుకున్న సీట్లు 29. 2019లో గెలుచుకున్న సీట్లు 47. ఈసారి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తన సీట్లను.. ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటుంది.

- తమిళనాడులో బీజేపీ ఓటు షేరు రెండంకెల శాతానికి చేరుతుంది.

- మోడీ.. అమిత్ షా లాంటి బడా నేతలు తూర్పు.. దక్షిణాది రాష్ట్రాల్లో తరచుగా పర్యటిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు.

ఇండియా కూటమి

- బీజేపీకి బాగా పట్టున్న పశ్చిమ.. ఉత్తరాది రాష్ట్రాల్లో కనీసం 100 సీట్లలో ఆ పార్టీని విపక్షాలు.. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఓడిస్తేనే బీజేపీకి ఆ సెగ తాకుతుంది. కానీ.. అలా జరిగే అవకాశం లేదు.

- - గత ఐదేళ్లలో తమిళనాడులో మోడీ చేసిన పర్యటనల సంఖ్యను.. వార్ ఫీల్డ్ లాంటి (బీజేపీ అనుకూల రాష్ట్రాలు) రాష్ట్రాల్లో రాహుల్.. సోనియా లేదంటే ఇతర విపక్ష నేతలు చేసిన పర్యటనల సంఖ్యను లెక్కించండి.

- సోనియా.. రాహుల్ పోరాడాల్సింది యూపీ.. బిహార్.. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో. కానీ.. వారు పర్యటిస్తోంది మణిపూర్.. మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో. ఇలా అయితే వారెలా గెలుస్తారు?

- ఒక్క కేరళలో గెలిస్తే దేశమంతా గెలిచినట్లు కాదు. మీరు యూపీ.. బిహార్.. మధ్యప్రదేశ్ లో గెలవనప్పుడు.. ఒక్క వయనాడ్ లో గెలవటం వల్ల ఉపయోగం ఉండదు.

- అమేఠీని వదులుకోవటం ఒక తప్పుడు సందేశాన్ని పంపుతుంది. 2014లో మోడీ గుజరాత్ తో పాటు.. వారణాసి నుంచి కూడా పోటీ చేశారు.

- హిందీ హార్ట్ ల్యాండ్ లో గెలవకకుండా ఆ ప్రాంతంలో ఉనికి బలంగా చాటుకోకుండా దేశాన్ని గెలవలేరు.

- కనీసం 350 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా ముఖాముఖి పోటీ చేయకపోతే కూటమికి అర్థం లేదు.

- బీజేపీని ఎదుర్కొనే నాయకత్వం.. ఎజెండా ఇండియా కూటమికి లేదు. అందుకే బీజేపీ పదే పదే గెలుస్తోంది.

కీలక విశ్లేషణలు

- బీజేపీ మూడోసారి గెలిస్తే బీజేపీ అధిపత్యం పెరిగిపోతుందా? అన్న ప్రశ్నకు.. ‘‘1984లో అతి పెద్ద గెలుపు నమోదు చేశాకే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది’’ అని మర్చిపోకూడదు.

- మోడీ నాయకత్వంలో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుందన్న వాదన ఒక పెద్ద భ్రమ.

- 2014 తర్వాత బీజేపీ వెనుకబడ్డ సందర్భాల్లో విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవటంలో విఫలమైంది.

- 2015, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో తప్ప చాలా చోట్ల బీజేపీ ఓడిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీ పుంజుకోవటానికి ప్రతిపక్షాలే అవకాశాల్ని ఇచ్చాయి.

- నోట్ల రద్దు తర్వాత గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఓడిపోయే స్థితికి వచ్చింది. 2018లో పలు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. వాటిని సొమ్ము చేసుకోకపోవటం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది.

- పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఓడిపోయినా.. విపక్ష నేతలు ఆ అవకావాన్ని వాడుకోలేదు. తీరిగ్గా ఇళ్లల్లో కూర్చున్నారు. ప్రధాని మోడీ మళ్లీ రాజకీయంగా పుంజుకునేలా చేశారు. పదే పదే క్యాచ్ లు చేజార్చితే.. అవతల ఉన్న బ్యాటర్.. అదీ మంచి బ్యాటర్ అయితే కచ్ఛితంగా సెంచరీ సాధిస్తాడు.

- మూడోసారి గెలిచిన తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకుంటానని మోడీ ప్రకటించారు. ఆయన ఏం చేస్తారన్న ఆసక్తి.. ఆందోళన ఒక రాజకీయ పరిశీలకుడిగా నాకూ ఉన్నాయి.