టీడీపీ ముఖ్య నేత కుమారుడి అరెస్టు.. రీజనేంటి?
తాజాగా టీడీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 29 Feb 2024 11:30 AM GMTఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా టీడీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవలే చంద్రబాబు ప్రకటించిన జాబితాలో చిలుకలూరిపేట నుంచి పుల్లారావు టిక్కెట్ దక్కించుకున్నారు. తాజాగా ఆయన కుమారుడు శరత్‌ను కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జీఎస్టీ ఎగవేశారని అభియోగం నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన 'ఆవేక్సా కార్పొరేషన్' అనే కంపెనీ ఉంది. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై జిఎస్టీ అధికారులు పిర్యాదు చేయడంతో కొన్నాళ్లుగా విచారణ జరిపిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అయితే.. ఈ అరెస్టు ఘటన వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మరింత రాజకీయ దుమారాన్ని రేపింది.
శరత్ అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు.
ఎన్నికలు వస్తున్న సమయంలో పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని టీడీపీ సీనియర్లు ఆరోపించారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిలకలూరి పేటలో ఓడిపోతామనే కారణంగా.. ఇక్కడి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావును మానసిక క్షోభకు గురి చేసేందుకే అధికార పార్టీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారని పుల్లారావు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాటిని ఢీకొట్ట లేకనే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు.
పుల్లారావు.. కంపెనీగా
2014లో చిలకలూరి పేట నుంచి విజయం దక్కించుకున్న పుల్లారావు.. చంద్రబాబు మంత్రిమండలిలో పుడ్ అండ్ సివిల్ సప్లైయ్స్, కన్జూమర్ వ్యవహారాలు, ధరల నియంత్రణ శాఖల మంత్రిగా పని చేశాడు . పదేళ్లపాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు శరత్ కంపెనీని ప్రారంభించారు. కొన్నాళ్లుగా ఈ కంపెనీపై ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి.