Begin typing your search above and press return to search.

పాస్టర్ ప్రవీణ్ మృతి ముందు అసలేం జరిగింది?

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో మృతి చెందిన క్రైస్తవ బోధకుడు పాస్టర్‌ ప్రవీణ్‌ పడగాల మృతి కేసులో విజయవాడలో ఆయన చివరిగా కనిపించినప్పటి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   1 April 2025 8:28 AM
పాస్టర్ ప్రవీణ్ మృతి ముందు అసలేం జరిగింది?
X

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో మృతి చెందిన క్రైస్తవ బోధకుడు పాస్టర్‌ ప్రవీణ్‌ పడగాల మృతి కేసులో విజయవాడలో ఆయన చివరిగా కనిపించినప్పటి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విజయవాడ రామవరప్పాడు చౌరస్తా సమీపంలోని ఓ పార్కులో విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన మృతి చెందే వరకు మధ్యలో ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో విజయవాడలో ప్రవీణ్‌ను చివరిసారిగా చూసిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ, టీకొట్టు మాస్టర్‌లు ఆ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు రామవరప్పాడు వద్ద జరిగిన సంఘటనలను వివరించారు.

ప్రవీణ్‌ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం హెడ్‌లైట్‌ పగిలిపోయి ఉండటం, ఆయన చాలా నీరసంగా కనిపించడంతో ట్రాఫిక్‌ ఎస్‌ఐ, టీకొట్టు మాస్టర్‌లు ఆ రాత్రి రాజమహేంద్రవరం వెళ్లవద్దని, స్థానికంగా ఉన్న హోటల్‌లో విశ్రాంతి తీసుకుని ఉదయం బయలుదేరాలని సూచించారు. అయితే రాజమహేంద్రవరంలో అత్యవసర పని ఉందని చెప్పి ప్రవీణ్‌ వారి సూచనను పట్టించుకోకుండా లైట్లు లేని ఆ బైక్‌పైనే వెళ్లిపోయినట్లు వారు తెలిపారు.

బండి నడపలేని స్థితిలో ఉన్న ప్రవీణ్‌ గత నెల 24న సాయంత్రం 4.45 గంటలకు గొల్లపూడిలోని పెట్రోల్‌ బంక్‌కు చేరుకున్నారు. అప్పటికే ఆయన ద్విచక్ర వాహనంపై తూలుతూ ఉండటం, బైకు లైటు పగిలిపోయి ఉండటం, బైక్‌ సేప్టీ రాడ్‌ వంకర పోవడం పెట్రోల్‌ బంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డయింది. బంకు సిబ్బంది ఎంత పెట్రోల్‌ కావాలని అడిగితే ఆయన చేతితో 8 అని సైగ చేశారు. అనంతరం రూ.872 ఫోన్‌పే ద్వారా చెల్లించి విజయవాడ వైపు వెళ్లిపోయారు.

- కళ్లజోడుకు ఒక అద్దం లేదు.. మగతగా కనిపించారు:

ఆ రోజు విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్సై సుబ్బారావు మాట్లాడుతూ "రామవరప్పాడు రింగ్‌ వద్ద నేను విధులు నిర్వహిస్తున్నాను. సాయంత్రం 5.20 గంటల సమయంలో సెల్ఫ్‌ యాక్సిడెంట్‌ జరిగింది. చుట్టుపక్కల వారు ప్రవీణ్‌ను లేపి పక్కన కూర్చోబెట్టారు. సమాచారం తెలిసిన వెంటనే నేను ప్రమాద స్థలానికి వెళ్లాను. బండికి హెడ్‌లైట్‌ ఊడిపోయింది. కళ్లజోడుకు ఒక అద్దం లేదు. దెబ్బలు తగిలాయా అని అడిగితే లేదన్నారు. సమీపంలోని పార్కులో కూర్చోబెట్టాము" అని తెలిపారు. "దాదాపు 3 గంటలు అక్కడే కూర్చున్నారు. నా విధులు ముగిసిన తర్వాత 8 గంటల సమయంలో వెళ్లి ప్రవీణ్‌ను పలకరించాను. టీకొట్టుకు తీసుకెళ్లి టీ ఇప్పించాను. అప్పటికే హెడ్‌లైట్‌ వేలాడుతోంది. నేను ట్రాఫిక్‌ బూత్‌లోకి తాడు కోసం వెళ్లాను. మళ్లీ తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. బాగా నీరసంగా, మగతగా ఉన్నారు" అని ఎస్‌ఐ వివరించారు.

- దెబ్బలు లేవు.. నీరసంగా ఉన్నారు:

టీకొట్టు మాస్టర్‌ నాగార్జున మాట్లాడుతూ ద్విచక్ర వాహనం పడిపోవడంతో పగిలిపోయిన హెడ్‌లైట్‌ను మరమ్మతు చేసేందుకు స్థానికంగా ఎవరైనా మెకానిక్‌ ఉన్నారా అని ప్రవీణ్‌ తనను అడిగారని చెప్పారు. ఇక్కడ ఎవరూ లేరని తాము చెప్పామన్నారు. హెడ్‌లైట్‌ కిందకు వేలాడుతుండటంతో కనీసం దానిని తీగతో కడతాను ఉండండి అని హోటల్‌లోకి వెళ్లి వచ్చేలోగానే ప్రవీణ్‌ తన వాహనంపై వెళ్లిపోయారని తెలిపారు. తన హోటల్‌ వద్దకు వచ్చే సమయానికి పాస్టర్‌ శరీరంపై ఎలాంటి దెబ్బలూ లేవని, ఆయన వేసుకున్న షర్టుపై మాత్రం వెనుక వైపు మట్టి అంటుకుని ఉందని టీ మాస్టర్‌ చెప్పారు. ఆయన చాలా నీరసంగా ఉన్నారని, కనీసం నిలబడలేకపోతున్నారని తెలిపారు. తన దగ్గరే టీ తాగారని వెల్లడించారు. తాను యూట్యూబ్‌లో పాస్టర్‌ చనిపోయారనే వీడియోలు చూసినప్పుడు, ఆ ద్విచక్ర వాహనం హెడ్‌లైట్‌ పగిలిపోయి ఉండటం చూసి గుర్తుపట్టానని ఆయన వివరించారు. తన హోటల్‌ దగ్గరకు వచ్చేసరికి ఆయన హెల్మెట్, మాస్క్‌ పెట్టుకుని ఉన్నారని తెలిపారు.

-ప్రవీణ్‌ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు:

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో ఏం జరిగిందనే దానిపై కొంత స్పష్టత రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సుమారు 200 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలతో కూడిన 20 మంది బృందం వేర్వేరు ప్రాంతాల్లో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన ఫొటోలు, సీసీ ఫుటేజీలపై విశ్లేషణ చేసి మరికొంత మందిని విచారిస్తున్నారు. ఆ రోజు చేసిన యూపీఐ చెల్లింపులపైనా వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టంతోపాటు ఫోరెన్సిక్‌ నివేదికలు రావాల్సి ఉంది. పాస్టర్‌ మృతి, పోలీసు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌ల కోణంలోనూ దర్యాప్తు చేసి వీలైనన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిశోర్‌ తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్‌లు పెట్టవద్దని, ఎవరి వద్దైనా ఆధారాలుంటే పోలీసులకు అందజేయాలని ఎస్పీ సూచించారు.

- పాస్టర్‌ మృతిపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్టు

క్రైస్తవ బోధకుడు ప్రవీణ్‌ పగడాల మృతిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దేవాబత్తుల నాగమహేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని లలితానగర్‌కు చెందిన నాగమహేష్‌ ప్రవీణ్‌ మృతిపై దుష్ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు సోమవారం మహేష్‌ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌ విధించడంతో నిందితుడిని కేంద్ర కారాగారానికి తరలించినట్లు మూడో పట్టణ సీఐ అప్పారావు తెలిపారు.

- పాస్టర్ ప్రవీణ్ కేసును స్వయంగా సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ విషయాన్ని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్ ప్లాజాను దాటారు. ఆ తర్వాత సాయంత్రం 4.07 గంటలకు కీసర టోల్ ప్లాజాను, రాత్రి 9.15 గంటలకు పొట్టిపాడు టోల్ గేట్ను దాటారు. కీసర, పొట్టిపాడు టోల్ గేట్ల మధ్య దూరం 64 కిలోమీటర్లు. ఈ 64 కిలోమీటర్ల ప్రయాణానికి పాస్టర్ ప్రవీణ్ 5 గంటలకు పైగా సమయం తీసుకోవడం అనుమానాస్పదంగా ఉంది. ఈ ఐదు గంటల్లో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు అన్ని కోణాల్లోనూ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.