Begin typing your search above and press return to search.

ప్రవీణ్ ప్రకాష్ సంచలనం.. ఆ పని చేయకుంటే పదవికి రాజీనామా

ఏపీలోని బడి బయట పిల్లలు సెప్టెంబరు నాలుగో తేదీ నాటికి ఉంటే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 5:13 AM GMT
ప్రవీణ్ ప్రకాష్ సంచలనం.. ఆ పని చేయకుంటే పదవికి రాజీనామా
X

అప్పగించిన బాధ్యతను నూటికి నూరు శాతం కమిట్ మెంట్ తో చేసే ఐఏఎస్ అధికారులు కొందరుంటారు. వారికి పనిని పనిలా కాకుండా ప్యాషన్ గా చేస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్. ఆయనకు ఆ బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంలో ఇచ్చారో కానీ.. అప్పటి నుంచి విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయటమే పనిగా పెట్టుకున్నారు. తాను పరుగులు తీస్తూ.. ఉపాధ్యాయులను పరుగులు పెట్టిస్తున్న ఆయన.. తాజాగా సంచలన సవాల్ చేశారు.

ఏపీలోని బడి బయట పిల్లలు సెప్టెంబరు నాలుగో తేదీ నాటికి ఉంటే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. 2005 సెప్టెంబరు - 2006 ఆగస్టుమధ్యన పుట్టిన పిల్లలంతా స్కూళ్లలో ఉండాలని.. వీరిలో ఏ ఒక్క బాలుడు.. బాలిక అయినా సరే స్కూల్ కు వెళ్లకుండా ఉంటే తన ఐఏఎస్ పదవిని వదిలేస్తానని ఆయన ప్రకటించటం సంచలనంగా మారింది.

గ్రామ.. వార్డు సచివాలయాలు.. వాలంటీర్లు.. ఉపాధ్యాయులు.. జూనియర్ లెక్చరర్లు.. జిల్లా అధికారులంతా కలిసి సెప్టెంబరు నాలుగు లోపు వంద శాతం జీఈఆర్ (గ్రాస్ రిక్రూట్ మెంట్ రేషియో)సాధించాలన్న ఆయన.. ఇప్పటికే ఏపీలోని 63,993 మంది వాలంటీర్లు వంద శాతం జీఈఆర్ పూర్తి చేశారన్నారు. వంద శాతం జీఈఆర్ పూర్తి అయ్యాక.. డేటా బేస్ తప్పుగా ఉందని కానీ.. పిల్లలు ఎవరైనా ఈ డేటా బేస్ లో లేరని కానీ నిరూపిస్తూ తాను తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన ఆయన.. ప్రపంచంలో నూటికి నూరు శాతం జీఈఆర్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ అవతరించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో ఉందన్న ఆయన.. ఐదేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి చదువుకుంటూనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ప్రవీణ్ ప్రకాశ్ మాటలు విన్నప్పుడు.. ఆయన్ను పని రాక్షసుడన్న బిరుదు ఎందుకు వచ్చిందో ఇట్టే అర్థమవుతుంది. ఏమైనా.. రాష్ట్రం బాగుపడాలి.. ప్రజలకు మేలు జరగాలన్న తపనతో పని చేసే ప్రవీణ్ ప్రకాశ్ లాంటి వారు ఏ రాష్ట్రానికైనా వరంగా మారతారని మాత్రం చెప్పకతప్పదు.