అధికారం పోగానే కీలక ఐఏఎస్ అధికారిలో పశ్చాత్తాపం!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ పాలనలో కొందరు ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 21 Jun 2024 8:08 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ పాలనలో కొందరు ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ వీరభక్తుల్లా వ్యవహరించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. అఖిల భారత సర్వీసు అధికారులై ఉండి నిబంధనల మేరకు పనిచేయాల్సిన ఈ అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్టుల్లా నడుచుకున్నారనే ఆరోపణలున్నాయి.
జగన్ వీరభక్త అధికారుల్లో ఒకరిగా టీడీపీ నేతలు ఆరోపించిన ఐఏఎస్ అధికారుల్లో ప్రవీణ్ ప్రకాశ్ కూడా ఉన్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఈయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించారు. నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ ప్రసాద్ ను బదిలీ చేస్తూ ఆయన కంటే ఎంతో జూనియర్ అయిన ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ ప్రకాశ్ ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గానూ వ్యవహరించారు. అక్కడి నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు తిరిగొచ్చి ఏపీ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖలో ప్రవీణ్ ప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలు, చర్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. క్షేత్ర స్థాయి పర్యటనల పేరుతో ఆయా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లిన ఆయన జెడ్పీ స్కూళ్లు ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ స్కూళ్ల టీచర్లపై మండిపడిన సందర్భాలున్నాయని అంటున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలంటూ పలువురు ఉపాధ్యాయులతో పరుషంగా మాట్లారనే విమర్శలున్నాయి.
చివరకు జిల్లా కలెక్టర్లకు కూడా ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేసేవారని.. వారిపైనా అజమాయిషీ చెలాయించాలని చూసేవారనే ఆరోపణలున్నాయి. ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహార శైలిపై పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు గతంలోనే నిరసన వ్యక్తం చేశాయి, బహిరంగంగా అందరి ముందు మందలించడమే కాకుండా సస్పెండ్ చేయాలని కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశాయి.
పాఠశాలల్లో సంస్కరణల పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రవీణ్ ప్రకాశ్ వేధించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవీణ్ ప్రకాశ్ ను పక్కనపెట్టింది. ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు. తాజా బదిలీల్లో ఆయనను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు ఆయన చూసిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను కోన శశిధర్ కు అప్పగించింది.
ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవర్నీ అవమానించలేదన్నారు. ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు.
గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నానని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. విద్యాశాఖ పురోగతి కోసమే తాను కృషి చేశానన్నారు. తాను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో విమర్శలు వచ్చాయని ప్రవీణ్ ప్రకాశ్ గుర్తు చేశారు.
అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే తాను ఉపాధ్యాయులతో మాట్లాడానని తెలిపారు. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదని వివరణ ఇచ్చారు. ఎవరైనా తమను ఇబ్బంది పెట్టానని భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నానన్నారు. దయచేసి వాటిని మనసులో ఉంచుకోవద్దని కోరారు. మరో మనిషిని అవమానించే గుణం తనకు లేదని స్పష్టం చేశారు.