Begin typing your search above and press return to search.

కుంభమేళా పొడిగింపు.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

కొన్ని విషాద ఉదంతాల్ని మినహాయిస్తే మహా కుంభమేళా సూపర్ సక్సెస్ కావటం తెలిసిందే. అంచనాలకు మించి కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Feb 2025 6:04 AM GMT
కుంభమేళా పొడిగింపు.. కలెక్టర్ ఏం చెప్పారంటే?
X

కొన్ని విషాద ఉదంతాల్ని మినహాయిస్తే మహా కుంభమేళా సూపర్ సక్సెస్ కావటం తెలిసిందే. అంచనాలకు మించి కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించటం తెలిసిందే. అంతకంతకూ పెరుగుతున్న కుంభమేళా ఆసక్తి భక్తజనాన్ని ప్రయాగ్ రాజ్ వైపు అడుగులు వేసేలా చేస్తోంది. ఇలాంటి వేళ.. ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న స్పందన నేపథ్యంలో మహాకుంభమేళాను పొడిగిస్తున్నట్లుగా ఒక పోస్టు వైరల్ అవుతోంది. దీంతో కొద్దిపాటి కన్ఫ్యూజన్ పెరుగుతోంది.

ఈ అంశంపై తాజాగా ప్రయాగ్ రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర మందర్ క్లారిటీ ఇచ్చారు. మహాకుంభమేళా తేదీలను పొడిగిస్తూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించినట్లే షెడ్యూల్ ఉంటుందని తేల్చి చెప్పారు. ‘‘మహా కుంభమేళా షెడ్యూల్ ను ముహురతం చూసి నిర్ణయించాం. దాని ముగింపులో ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మహాకుంభమేళా ముగుస్తుంది’’ అని స్పష్టత ఇచ్చారు.

ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జనవరి 13న మొదలైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 నాటికి ముగుస్తుంది. పుణ్యస్నానాల కోసం 45 కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు అంచనా వేస్తే.. ఫిబ్రవరి 18 నాటికే 55 కోట్ల మంది రావటం.. రానున్న ఎనిమిది రోజుల్లో మరింత భారీగా భక్తులు వస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పుణ్య స్నానాలపై మొదట్లో క్రేజ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికి.. రోజులు గడుస్తున్న కొద్దీ.. మహాకుంభమేళాకు వెళ్లాలన్న ఆసక్తి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది.

ఇలాంటి సమయంలోనే కుంభమేళా తేదీలను పొడిగిస్తారంటూ ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. అది కాస్తా అంతకంతకూ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ జిల్లా కలెక్టర్ స్పందించి.. స్పష్టత ఇచ్చారు. మహా కుంభమేళాను పొడిగించాలంటూ ప్రభుత్వం నుంచి కానీ.. జిల్లా అధికార యంత్రాంగం నుంచి కానీ ఎలాంటి ప్రతిపాదన లేదన్న ఆయన.. భక్తుల్ని తప్పుదోవ పట్టించే ఈ తరహా ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు సంబంధించి మిగిలిన రోజులకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్న ఆయన.. ప్రయాగ్ రాజ్ లో నెలకొన్న భారీ ట్రాఫిక్ నేపథ్యంలో నియంత్రణపై ఫోకస్ పెంచినట్లుగా పేర్కొన్నారు.