బడ్జెట్ - 2025... నిర్మలమ్మ ముందు టాక్స్ పేయర్స్ డిమాండ్స్ ఇవే!
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 11:40 AM GMTఫిబ్రవరి 1న ఆర్ధిక సంవత్సరానికి (2025 - 26)కి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రకరకాల ట్యాక్సులు, జీఎస్టీ బాదుళ్లతో వాయించారనే విమర్శలు సంపాదించుకున్నట్లు చెప్పే నిర్మలమ్మ నుంచి టాక్స్ పేయర్స్ ఏమి కోరుకుంటున్నారనే విషయంపై సర్వే జరిగింది.
అవును... 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ సమయంలో గ్రాంట్ థోంటన్ భారత్ ప్రీ-బడ్జెట్ సర్వే తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానంగా రాబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను రేట్లు తగ్గాలని అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నట్లు ఈ సర్వే తెలిపింది.
ఇందులో భాగంగా... గ్రాంట్ థోంటన్ భారత్ ప్రీ-బడ్జెట్ సర్వేలో సుమారు 57 శాతం మందిది ఇదే మాట అని చెబుతున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో 72 శాతం మంది కొత్త ఆదాయ పన్ను విధానాన్నే ఎంచుకుంటుండగా.. 63 శాతం మంది కొత్త ఆదాయ పన్ను విధానంలోని ప్రోత్సాహకాలు మరింత పెరగాలని అభిప్రాయపడుతున్నట్లు సర్వే తెలిపింది.
అదేవిధంగా... కొత్త పన్ను విధానంలోనూ పన్ను రేట్లు తగ్గాలని సుమారు 46 శాతం మంది డిమాండ్ చేస్తుండగా.. ఈ సారి పన్ను మినహాయింపు పరిమితుల్ని పెంచుతారనే నమ్మకాన్ని సుమారు పాతికశాతం మంది వ్యక్తం చేశారు. ఇక 500 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో.. వ్యక్తిగత ఐటీ తగ్గి, వ్యక్తుల ఆదాయం పేరిగేలా నిర్ణయాలుండాలని అంతా కోరుకుంటున్నారు!
ఇదే సమయంలో... నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్.పీ.ఎస్) పను మినహాయింపు పరిమితుల్ని పెంచాలని.. ఎన్.పీ.ఎస్. మొత్తాల ఉపసంహరణ నిబంధనల్ని ఇంకా సరళతరం చేయాలని.. దీనివల్ల రిటైర్మెంట్ సేవింగ్స్ కు ఊతమిచ్చినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈవీ వెహికల్స్ వినియోగం పెరిగేలా వాటి కనుగోళ్లపై పన్ను ప్రోత్సాహకాలు అందివ్వాలని అంటున్నారు.