Begin typing your search above and press return to search.

డిజిటల్ యుగంలో ఇలాంటి కష్టం పవన్ కల్యాణ్ ఒక చూపు చూడయ్యా!

వీరికి అవసమరయ్యే మౌలిక సదుపాయాల కల్పన విషయాలు ప్రభుత్వాలకు పట్టవు.

By:  Tupaki Desk   |   4 Aug 2024 11:03 AM IST
డిజిటల్ యుగంలో ఇలాంటి కష్టం  పవన్ కల్యాణ్ ఒక చూపు చూడయ్యా!
X

ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ యుగంలో ఏదీ అసాధ్యం కాదు. కాకుంటే.. లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న కాంక్ష బలంగా ఉంటే సరిపోతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న బాధల్ని..కష్టాల్ని మనసున్న మనషులుగా ప్రభుత్వాలు స్పందిస్తూ.. ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నాగరిక జీవనానికి దూరంగా ఉంటూ.. ప్రకృతికి దగ్గరగా బతికేసే గిరిపుత్రుల కష్టాలు అన్నిఇన్ని కావు. వీరికి అవసమరయ్యే మౌలిక సదుపాయాల కల్పన విషయాలు ప్రభుత్వాలకు పట్టవు. వారు ఎదుర్కొనే కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్న దానికి నిదర్శనం ఈ ఫోటో.

వర్షాలు కురిసే వేళలో మన్యంలో పరిస్థితులు ఎంత కష్టంగా.. మరెంత క్లిష్టంగా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఈ ‘అమ్మ’కు ఎదురైన వెతలు ఒక నిదర్శనం. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జామిగుడ పంచాయితీ గుంజివాడ గ్రామానికి చెందిన రాజేశ్వరి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం రాత్రి ఆమెకు అనుకోకుండా నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే గుంజివాడ గెడ్డ దాటాల్సి ఉంది.

అయితే.. ఈ మధ్య కురిసిన వానలతో వాగు ఉద్ధ్రతంగా ప్రవహిస్తోంది. రాత్రి వేళ కావటంతో ఆమెను బయటకు తీసుకెళ్లటం సాధ్యం కాలేదు. మన మాదిరి ప్రయాణ సౌకర్యాలు ఉండవు. దీంతో.. ఉదయం వరకు నరకయాతన అనుభవించిన ఈ గిరిపుత్రిక.. ఉదయం 7 గంటలకు ఆమెను వాగు వద్దకు తీసుకొచ్చారు. అసలు కష్టమంతా వాగును దాటటమే.

దీంతో ఆమెను ఒక పెద్ద వంట పాత్రలో కూర్చోబెట్టారు. ఖాళీ బుర్రలు కట్టుకున్న ముగ్గురు ఆమెను ఆ ప్రవాహంలో నెమ్మదిగా గడ్డ దాటించారు.అక్కడి నుంచి రూఢకోట ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. చికిత్స చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రసవం అయ్యే వరకు ఆసుపత్రికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్న సూచన చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రికి దగ్గరగా ఉండేలా ఉండటం వారికి ఎలా సాధ్యం? అదే వాగు దాటేందుకు వీలుగా బ్రిడ్జి ఉన్నా.. మరే ఇతర మార్గం ఉన్నా.. ఇంత కష్టం తప్పుతుంది. అందుకే కూటమి ప్రభుత్వం కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కానీ ఇలాంటి ఇష్యూను టేకప్ చేస్తే సమస్య ఇట్టే పరిష్కారం అయ్యే వీలుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.