Begin typing your search above and press return to search.

వ్యోమగాములకు ఆహారాన్ని సిద్ధం చేయడానికి గ్రహశకలాలు!

అంతరిక్ష యాత్రలలో ఉండే వ్యోమగాములకు ఆహార భద్రతను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని తెరపైకి తెచ్చారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 1:30 PM GMT
వ్యోమగాములకు ఆహారాన్ని సిద్ధం చేయడానికి గ్రహశకలాలు!
X

అంతరిక్ష యాత్రలలో ఉండే వ్యోమగాములకు ఆహార భద్రతను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... వ్యోమగాములు తమ పోషక అవసరాలను తీర్చుకోవడానికి గ్రహశకలాలను ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

అవును... ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీలో ప్రచురించబడిన ఓ అధ్యయనమంలో.. వ్యోమగాములకు ఆహార అవసరాలను తీర్చడానికి గ్రహశకలాలను ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. అంతరిక్ష శిలల నుంచి కార్బన్ ను సంగ్రహించి.. తినదగిన ఆహారంగా మార్చడం అనేది వీరి ఆలోచన అని చెబుతున్నారు.

మిచిగాన్ టెక్నలాజికల్ యూనివర్శిటీ పరిశోధకుల నేతృత్వంలోని అధ్యయనంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తినదగిన ఆహారంగా మార్చే ఈ ఆలోచన యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రాజెక్ట్ నుంచి ప్రేరణ పొందినట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్ ను ఘనపదార్థాలు, వాయువు, నూనె గా విచ్ఛిన్నం చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు.

ఈ నూనె ద్వారా పోషకమైన బయోమాస్ ను ఉత్పత్తి చేస్తారు! ఈ మేరకు అంటారియోలోని వెస్ట్రన్ యూనివర్శిటీ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ జాషువా పియర్స్ వివరించారు! ఓ ప్రత్యేక పరిశోధనలో భూమిపై పడిన ఉల్కల ముక్కలను సూక్ష్మజీవులకు అందించారు. ఆ ఉల్క పదార్థంపై సూక్ష్మజీవులు వృద్ధి చెందాయని గ్రహించారు.

ఈ ఆలోచన సక్సెస్ అయితే... 2020లో నాసా సందర్శించిన బెన్నూ లాంటి 500 మీటర్ల వెడల్పు గల గ్రహశకలం.. ఒక సంవత్సరానికి 600 నుంచి 17,000 వ్యోమగాములకు ఆహారం ఇవ్వగలదని పియర్స్ చెప్పారు! అయితే ఈ సమయంలో ఓ క్లిష్టమైన సవాలు మిగిలి ఉంది. ఇందులో భాగంగా... ఈ బయోమాస్ ను వ్యోమగాములు తినడానికి సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి విస్తృతమైన పరీక్షలు అవసరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు!!