Begin typing your search above and press return to search.

అచ్చం అఫ్ఘానిస్థాన్ లా.. మరో దేశం తిరుగుబాటుదారుల వశం

కొందరు విమానాల రెక్కలు పట్టుకుని మరీ 'ఎగిరిపోదామని' ప్రయత్నించారు.

By:  Tupaki Desk   |   8 Dec 2024 9:31 AM GMT
అచ్చం అఫ్ఘానిస్థాన్ లా.. మరో దేశం తిరుగుబాటుదారుల వశం
X

మూడేళ్ల కిందట అఫ్ఘానిస్థాన్ లో ఏం జరిగిందో అందరూ చూశారు.. ఎన్నో ఏళ్ల నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తాలిబన్ మిలిటెంట్ గ్రూప్.. తమ దేశం నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయిన మరుక్షణమే తమ జూలు విదిల్చాయి. దీంతో కాందహార్ తో మొదలుపెట్టి ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటూ ముందుకు సాగాయి. చివరకు రాజధాని కాబూల్ చేరుకుని తుపాకీలతో గర్జన చేశాయి. దీనికిముందు తాలిబాన్ల పాలనను తలచుకుంటేనే భయమేసి వందల మంది అఫ్ఘాన్ ను వీడి పారిపోయారు. కొందరు విమానాల రెక్కలు పట్టుకుని మరీ 'ఎగిరిపోదామని' ప్రయత్నించారు. ఇప్పు అచ్చం ఇలాగే మరో దేశంలో పరిస్థితులు నెలకొన్నాయి.

15 ఏళ్ల అంతర్యుద్ధం..

అసలే కక్షలతో రగిలే పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం. అక్కడి కీలక దేశమైన సిరియాలో అంతర్యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రమైంది. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటున్నారు. గత వారం దేశంలో రెండో అతి పెద్ద నగరం అలెప్పోను ఆక్రమించిన వారు.. శనివారం రాత్రి సిరియా రాజధాని డమాస్కస్‌ ను సైతం ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పరిణామాలు అచ్చం అఫ్ఘానిస్థాన్ పరిణామాలను తలపిస్తుండడం గమనార్హం.

కాగా, అధ్యక్షుడు బషర్ అల్‌- అసద్‌ కు వ్యతిరేకంగా 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. అయితే, దీనిని రష్యా, ఇరాన్ మద్దతుతో అసద్ అణచివేశారు. మొన్నటివరకు ఈ రెండు దేశాల దళాలు సిరియాలో ఉన్నాయి. అయితే, ఇటీవల ఇజ్రాయెల్ పై దాడి కోసం ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా బలహీనపడ్డాయి. దీంతో సిరియా నుంచి క్రమంగా తప్పుకోసాగాయి. లేదా బలహీనం అయ్యాయి. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ పరోక్ష మద్దతుతో తిరుగుబాటుదారులు పుంజుకున్నారు.

ప్రభుత్వ దళాలను తరిమికొట్టారు. ఒక్కోటిగా నగరాలను వశం చేసుకుంటూ దేశ రాజధాని డమాస్కస్ నూ ఆధీనంలోకి తీసుకుకున్నారు. దీంతో దేశం అంతా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

డమాస్కస్ ను చుట్టుముట్టడం ద్వారా.. ఆపరేషన్‌ చివరి దశను ప్రారంభించినట్లు ‘హయాత్‌ తహరీర్‌ అల్‌ షమ్‌’ (హెచ్‌టీఎస్‌) నేతృత్వంలోని తిరుగుబాటు దళాల ప్రతినిధి హసన్‌ అబ్దుల్‌ ఘనీ ఇప్పటికే ప్రకటించారు.

అధ్యక్షుడు బషర్ అల్‌- అసద్‌ డమాస్కస్ ను విడిచి వెళ్లినట్లు ఓ సీనియర్‌ అధికారి కూడా స్పష్టం చేశారు.