బైడెన్ ను ఏసేస్తానన్నాడు.. పోలీసులు అతన్ని ఏసేశారు
బైడెన్ సదరు రాష్ట్రాన్ని చేరుకోవటానికి కాస్త ముందుగా.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు
By: Tupaki Desk | 10 Aug 2023 5:17 AM GMTప్రపంచానికే పెద్దన్న అమెరికా. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించే నాయకుడి మీద ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటం వరకు ఓకే. ఎందుకంటే.. అమెరికాలో భావ ప్రకటనా స్వేచ్ఛకు కాస్తంత ఎక్కువే ప్రాధాన్యత ఇస్తుంటారు. అలా అని తనకు నచ్చిన అధ్యక్షుల వారిని ఏసేస్తానంటూ అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏజెన్సీలు ఊరుకుంటాయా? తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అధ్యక్షుల వారిని ఏసేస్తానంటూ అదే పనిగా పోస్టులు పెట్టే వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో.. సదరు వ్యక్తి హతమైన ఉదంతం చోటు చేసుకుంది.
ఉటా స్టేట్ లోని ప్రోవాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో 70 ఏళ్ల రాబర్ట్ సన్ అనే పెద్ద మనిషి.. ఈ మధ్యన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ తదితర ప్రముఖులపై అదే పనిగా నోరు పారేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో వార్నింగ్ పోస్టులు పెడుతున్నాడు. బెదిరింపులకు దిగటం.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం చేస్తున్న ఇతడు.. తాజాగా ఒక పోస్టు పెట్టాడు.
ఉటా రాష్ట్ర పర్యటనకు బైడెన్ వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'బైడెన్ ఇక్కడకు వస్తున్నట్లు తెలిసింది. నా ఎం24 స్నైపర్ రైఫిల్ ను వాడాల్సిన సమయం ఆసన్నమైంది' అంటూ బెదిరింపులకు దిగాడు. ఇతడి పోస్టును దర్యాప్తు ఏజెన్సీలకు షేర్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు.. బైడెన్ సదరు రాష్ట్రాన్ని చేరుకోవటానికి కాస్త ముందుగా.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
కానీ.. కుదరకపోవటంతో అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఉదంతంలో సదరు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి హతమయ్యాడు. అతడ్ని సజీవంగా అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నించినా.. సాధ్యం కాలేదన్న పోలీసు వర్గాలు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించటం గమనార్హం.