Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్ స్క్రిప్టు ఎవరిది పుష్ప?

సంధ్య థియేటర్ ఎపిసోడ్ లో ఏం జరిగిందన్నది అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 4:41 AM GMT
ప్రెస్ మీట్ స్క్రిప్టు ఎవరిది పుష్ప?
X

కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు. అంత మాత్రాన.. దాన్నే నమ్ముకుంటే ఎలా దెబ్బ తింటారన్న విషయం చాలా సందర్భాల్లో చాలా మంది ప్రముఖుల విషయంలో జరిగింది. ఇప్పుడు అలాంటిదే ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అలియాస్ పుష్ప విషయంలోనూ జరుగుతోందని చెప్పాలి. సంధ్య థియేటర్ ఎపిసోడ్ లో ఏం జరిగిందన్నది అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.

అయితే.. ఇక్కడ సమస్య మొత్తం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషాదం ఒక ఎత్తు అయితే.. దాని తర్వాత అల్లు అర్జున్ స్పందన ఏమిటి? అన్నది మరొక ప్రశ్న. నిజానికి ఇక్కడే ఆయన తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. తన సినిమా చూసేందుకు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఒక ఎత్తు అయితే.. దాని కారణంగా ఒక నిండు ప్రాణం పోవటం.. అంత విషాదం జరిగిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు సినిమాను చూసారని పోలీస్ లు చెప్పడం .. పోలీసులు స్పష్టంగా చెప్పిన తర్వాత.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆయన సినిమా నుంచి బయటకు వచ్చేశారని చెబుతుండటం . ఈ విషయం తాజాగా పోలీస్ లు బయటకు తీసుకు వచ్చిన వీడియో ప్రూఫ్ గా చెప్పడం .

అయితే.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా తనను తాను సమర్థించుకోవటం.. తన చర్యల్ని గొప్పగా చెప్పుకోవటం అప్పుడప్పుడు కొందరు చెప్పుకుంటారు. అలాంటి పనే చేశారు అల్లు అర్జున్. జరిగింది ఒకటైతే.. దానికి భిన్నంగా అల్లు అర్జున్ స్పందించిన తీరు ఆయన్ను విమర్శల పాలు చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. అల్లు అర్జున్ తో పాటు సినీ పరిశ్రమ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత.. కేవలం మూడు గంటల వ్యవధిలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికైనా జరిగిన తప్పునకు చెంపలు వేసుకుంటారని చాలామంది భావించినా.. ఆయన మాత్రం అందుకు భిన్నంగా అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వటం ద్వారా కొత్త యుద్ధానికి తెర తీశారని చెప్పాలి. ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టాలన్నది ఒక ఎత్తుగడ. అదే టైంలో ఎప్పుడు ఆపేయాలన్నది కూడా తెలిసి ఉండాలి. కానీ.. అల్లు అర్జున్ ఈ రెండు విషయాల్లోనూ వీక్ అన్న విషయం తాజా ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలో సీన్లు మొత్తం దర్శకుడి కంట్రోల్ లో ఉంటాయి. కానీ.. రియల్ లైఫ్ లో అలా ఏమీ ఉండదు. ఎవరికి వారి చేతుల్లోనే ఉంటాయి. ఈ చిన్న విషయాన్ని అల్లు అర్జున్ ఎలా మిస్ అయ్యారు.

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన పదహారు.. పదిహేడు గంటల తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం.. అల్లు అర్జున్ స్పందించిన తీరుకు సంబంధించిన ప్రశ్నలు విలేకరులు అడిగినప్పుడు.. అందుకు బదులుగా పది నిమిషాల నిడివి ఉన్న వీడియోను ప్రదర్శించటం ద్వారా.. అసలేం జరిగిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ వీడియోను చూసిన తర్వాత కలిగే మొదటి భావన ఏమంటే.. తొక్కలో ప్రెస్ మీట్ పెట్టమని అల్లు అర్జున్ కు సలహా ఇచ్చిందెవరు? అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పుసుక్కున ప్రెస్ మీట్ పెట్టేయమని స్క్రిప్టు రాసి ఇచ్చిందెవరు? లాంటి ప్రశ్నలు మదిలో మెదలక మానవు. మొత్తంగా ఫైర్ కు వైల్డ్ ఫైర్ కౌంటర్ తెర మీద కనిపించటానికి మూడేళ్ల కసరత్తు జరిగిందన్న విషయాన్ని అల్లు అర్జున్ ఎలా మర్చిపోయారు? ఒక చిన్న పదానికి కౌంటర్ ఇవ్వటానికి మూడేళ్ల టైం తీసుకున్నప్పుడు.. ఒక రాష్ట్ర సీఎం అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మూడు గంటల టైం కూడా తీసుకోకపోవటం ఏమిటి పుష్పా.