ప్రెస్‌మీట్ ముగిసింది.. టీడీపీ నేత అరెస్టు.. ఎక్కడ.. ఏం జరిగింది?
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన స్తానికంగా చర్చనీయాంశం అయింది.
By: Tupaki Desk | 13 Nov 2023 3:13 PM GMTమీడియా సమావేశం ఇలా ముగిసిందో లేదో.. టీడీపీ నేత ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ దళిత నాయకుడిపై దాడి జరిగిన ఘటనలో ఈయన పాత్ర కూడా ఉందని పేర్కొంటూ కోర్టుకు హాజరు పరిచి.. అటు నుంచి జైలుకు తరలించారు. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన స్తానికంగా చర్చనీయాంశం అయింది.
అసలేం జరిగింది?
ప్రొద్దుటూరులో వైసీపీకి చెందిన దళిత నాయకుడు బెనర్జీపై అనేక ఆరోపణలు వున్నాయి. బెదిరింపులు, హెచ్చరింపులు, వేధింపులు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. కొన్నాళ్లుగా ఓ మహిళను ఆయన వేధిస్తున్నారనే ఫిర్యాదు కూడా ఉంది. అయితే.. దీనిని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో సదరు మహిళకు టీడీపీ నాయకులు అండగా నిలిచారు. వీరిలో భరత్, రామ్మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే.. మహిళకు అండగా ఉన్న వీరిని చంపుతానని బెనర్జీ బెదిరించినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే గత 16 రోజుల కిందట బెనర్జీ-భరత్‌ల మధ్య భౌతిక దాడి జరిగింది. ఈ ఘటనలోనే బెనర్జీ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయతే.. ఈ ఘర్షణలో ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న జి.ప్రవీణ్ కుమార్‌రెడ్డి హస్తం కూడా ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రవీణ్ అప్పటి నుంచి స్థానికంగా దూరంగా ఉంటున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా ఆయన ఇంటికి రావడం, సోమవారం మీడియా ముందుకు వచ్చి.. అసలేం జరిగిందనే విషయాన్ని వివరించడంతో.. ఈ విషయం పోలీసులకు అందింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బెనర్జీపై దాడిలో మీరు కూడా ఉన్నారంటూ.. ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలోనే అరెస్టు కు ప్రయత్నించగా.. ఆయన వారించారు. అనంతరం పోలీసులు ప్రవీణ్‌ను అరెస్టు చేసి.. కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశంతో రిమాండ్‌కు పంపించారు.
అసలు ఎవరిని అరెస్టు చేయాలి?
వాస్తవానికి వైసీపీ దళిత నాయకుడుగా ప్రచారంలో ఉన్న బెనర్జీపై అనేక ఆరోపణలుఉన్నాయి. స్థానికంగా ఆయన చెలరేగుతు న్నారని.. సొంత పార్టీ నాయకులపైనే ఆయన దూకుడుగా ఉన్నారని.. బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. బీసీ నాయకుడు, టీడీపీ సానుభూతి పరుడు నందం సుబ్బయ్య హత్య కేసులోనూ బెనర్జీ ప్రధాన నిందితుడని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రత్యర్తులకు పోన్లు చేసి.. మాట వినకుంటే మీకు కూడా సుబ్బయ్య గతేనంటూ హెచ్చరిస్తున్నారని అంటున్నారు.
ఇదిలావుంటే, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్.. పలువురు కౌన్సిలర్లు కూడా తాము బెనర్జీ బాధితులమని వాపోతు న్నారు. వీటిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ.. పోలీసులు ఎక్కడా బెనర్జీపై ఈగవాలనివ్వలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే బెనర్జీ దూకుడు పెంచి మహిళలను వేధింపులకు కూడా గురి చేస్తున్నారని, వాటిని అడ్డుకోవడంతోనే ఘర్షణ జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయంలోపై చర్చ తీసుకోవాల్సిన మనిషిని వదిలేసి.. టీడీపీ నేతలను అరెస్టు చేయడం వివాదంగా మారింది.