Begin typing your search above and press return to search.

పని ఒత్తిడి భరించలేక హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగిని సూసైడ్

హైదరాబాద్ మహానగరంలో ఒక మహిళా బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 9:30 AM GMT
పని ఒత్తిడి భరించలేక హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగిని సూసైడ్
X

వ్యాపార సంస్థల లక్ష్యాలు మారుతున్న కొద్దీ.. ఉద్యోగుల మీద ఆ ఒత్తిడి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతానికి భిన్నంగా పలువురు దిగ్గజ వ్యాపారవేత్తలు.. కార్పొరేట్ ప్రముఖులు సైతం ఉద్యోగులు చేసే పని గంటల్ని పెంచేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. పట్టించుకోని పరిస్థితి. ఇదిలా ఉండగా.. కార్పొరేట్ సంస్థల్లోనే కాదు.. ప్రభుత్వ రంగంలోకి విస్తరిస్తుందా? అంటే.. తాజా పరిణామాలు ఆ ధోరణినే చూపిస్తున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ మహానగరంలో ఒక మహిళా బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది. ఎందుకుంటే.. ఆమె పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

బాచుపల్లి పరిధిలో గురువారం సాయంత్రం ఈ విషాద ఉదంతంచోటు చేసుకుంది. ఏపీలోని పిఠాపురానికి చెందిన 32 ఏళ్ల సత్య లావణ్యకు అదే ప్రాంతానికి చెందిన వీరమోహన్ తో ఐదేళ్ల క్రితం పెళ్లైంది. వారు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ఐటీ ఉద్యోగి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నారు.

కొంతకాలంగా బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువైనట్లుగా ఆమె తన బంధు మిత్రుల వద్ద వాపోతున్నట్లుగా చెబుతున్నారు. సంక్రాంతి పండక్కి శుక్రవారం సొంతూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గురువారం బ్యాంకుకు వెళ్లిన ఆమె.. ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా అపార్టు మెంట్ కు వెళ్లిన ఆమె.. టెర్రస్ మీదకు వెళ్లి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలైన ఆమెను ఆసుపత్రిలో చేర్చే సమయానికి ఆమె మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.