Begin typing your search above and press return to search.

ప్రిగోజిన్ స్వీయ మరణ శాసనం.. అంతా 30 సెకన్లలోనే?

కిరాయి మూక వాగ్నర్ గ్రూప్ నకు అధిపతి అయిన ప్రిగోజిన్ రెండు నెలల కిందట రష్యాలో తిరుగుబావుటా ఎగురవేశాడు

By:  Tupaki Desk   |   24 Aug 2023 8:15 AM GMT
ప్రిగోజిన్ స్వీయ మరణ శాసనం.. అంతా 30 సెకన్లలోనే?
X

రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఎదిరిస్తే ఏమవుతుంది..? ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీలా జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది.. లేదా కిటికీ పక్కన ఉండగా బాంబు పేలో.. తూటా తగిలో చిటికెలో ప్రాణాలు కోల్పోతారు. ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలో జరిగిపోతుంది. ఓ గూఢచారి దేశ అధ్యక్షుడు అయితే ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసేలా.. ఓ నియంత తలుచుకుంటే ఎలా ఉంటుందో చాటేలా.. ఓ సర్వాధికారి కన్నెర్రజేస్తే ఏమవుతుందో అర్థమయ్యేలా చేసిందే తాజాగా జరిగిన 'పిగ్రోజిన్' దుర్మరణం..

అది దుర్మరణం కాదు.. మహా కుట్రే..

పుతిన్ అంటే పైకి కనిపించేంత సామాన్యుడు సాత్వికుడు ఏమీ కాదు. కరుడుగట్టిన రష్యావాది. ఒకప్పటి సోవియట్ యూనియన్ ను కాంక్షించే సామ్రాజ్యవాది.. ఉక్రెయిన్ మీద నిర్దాక్షిణ్యంగా దండయాత్ర చేసినా.. జార్జియా లో వేలుపెట్టినా.. సిరియాలో కాలుదువ్వినా.. అంతా రష్యా ప్రయోజనాలకే. అలాంటి పుతిన్.. ఏకంగా తన జోలికే వస్తే ఎవరినైనా ఎందుకు సహిస్తాడు. తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ ఎంత దగ్గరివాడైనా ఎందుకు భరిస్తాడు..? ఇప్పుడదే జరిగింది. విమానం కూలిన ఘటనలో అతడిది అందరూ దుర్మరణం అంటున్నారు కానీ.. ప్రిగోజిన్ మరణం ఉన్న వెనుక ఉన్నది మహా కుట్ర.

అంతా సెకన్లలోనే..

కిరాయి మూక వాగ్నర్ గ్రూప్ నకు అధిపతి అయిన ప్రిగోజిన్ రెండు నెలల కిందట రష్యాలో తిరుగుబావుటా ఎగురవేశాడు. ఓ దశలో అంతర్యుద్ధం తప్పదనిపించేలా పరిస్థితులు ఉన్నాయి. కానీ.. బెలారస్ సయోధ్యతో సద్దుమణిగింది. కాగా.. అప్పట్లోనే ప్రిగోజిన్.. జాగ్రత్త అంటూ అమెరికా హెచ్చరించింది. రెండు నెలలు కూడా పట్టలేదు.. అతడు ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి చనిపోవడానికి..? కాగా, ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ఎంబ్రేర్‌ లీగసీ 600 ఎగ్జిక్యూటివ్ జెట్ కు సంబంధించి ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ.. ఫ్లైట్ రాడార్ 24 కీలక విషయం తెలిపింది. ప్రమాదానికి 30 సెకన్ల ముందు కూడా విమానం ప్రయాణం సవ్యంగానే ఉన్నట్లు పేర్కొంది.

కేవలం క్షణాల్లో విమానం కుప్పకూలినట్లు చెబుతోంది. రష్యా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.11 సమయంలో ఎంబ్రేర్‌ లీగసీ 600 నుంచి ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కు ట్రాన్స్ మిటింగ్ పొజిషన్‌ డేటా ఆగిపోయింది. ఆ జెట్‌ నుంచి మరో 9 నిమిషాలు ఇతర సమాచారం బదిలీ అయ్యింది. విమానం 28 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. క్షణానికోసారి అది వేగంగా మారిపోయింది. ఒక దశలో 30వేల అడుగులకు వెళ్లింది. కేవలం 30 సెకన్లలోనే విమానం 28 వేల అడుగుల ఎత్తు నుంచి 8 వేల అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత కొద్ది సెకన్లకే కుప్పకూలింది.

నిట్ట నిలువునా కూలింది..

ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలను చూస్తే విమానం నిట్ట నిలువునా కూలినట్లు తెలుస్తోంది. దీనికి 30 సెకన్ల ముందు కూడా విమానంలో సమస్యల్లేవు. మరోవైపు ప్రమాదంలో ప్రిగోజిన్‌ సహా 10 మంది దుర్మరణం చెందినట్లు రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ వెల్లడించింది. ఇందులో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది. వాగ్నర్‌ గ్రూప్ సెకండ్‌ - ఇన్‌ -కమాండ్‌ దిమిత్రి ఉత్కిన్‌ కూడా చనిపోయాడు.

కీలక మార్గంలో..

రష్యా రాజధాని మాస్కో నుంచి మరో ప్రధాన నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెళ్తుండగా విమాన ప్రమాదం జరిగింది. రష్యాలో ఈ రెండు అతిపెద్ద నగరాలు. ఒక విధంగా చెప్పాలంటే.. ఆకాశంలో ఇవి జాతీయ రహదారులన్నమాట. కాగా, ప్రిగోజిన్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడున్నారనేది ఆసక్తికరంగా మారింది. తిరుగుబాటు సమయంలో ప్రిగోజిన్ కు భయపడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడని పుతిన్ ను పాశ్చాత్య దేశాలు ఎగతాళి చేశాయి. మరిప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే.. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జరిగిన కుర్క్స్ పోరాటానికి 80 ఏళ్లు ముగిశాయి. ఈ వార్షికోత్సవానికి పుతిన్ హాజరయ్యారు. దీనికిముందు భారత ప్రధాని మోదీ పాల్గొన్న బ్రిక్స్‌ సదస్సుల్లో పుతిన్ వర్చువల్ గా ప్రసంగించారు. ఆ సందర్భంగానూ పశ్చిమ దేశాల మొదలుపెట్టిన యుద్ధాన్ని ముగించేందుకే ఉక్రెయిన్ లో సైనిక చర్యను ప్రారంభించినట్లు పుతిన్‌ సమర్థించుకున్నారు.

స్వీయ మరణశాసనం రాసుకున్నాడు..

ప్రిగోజిన్ మరణంపై యుద్ధ బాధిత ఉక్రెయిన్ స్పందించింది. ఇది పుతిన్ చేసిన ఘోరమే అని పేర్కొంది. 'పుతిన్ ఎవరినీ క్షమించడు అనేది మరోసారి స్పష్టమైంది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో విచిత్ర హామీలు, పుతిన్ మీద నమ్మకంతో ప్రిగోజిన్ రాజీ ఒప్పందంపై సంతకం చేశాడు. ఇప్పుడదే అతడికి మరణ శాసనమైంది'' అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు మిఖైలో పొడొలిక్‌ వ్యాఖ్యానించారు.