Begin typing your search above and press return to search.

సన్యాసి అవుదామనుకున్న మోడీ ప్రధాని పీఠం వైపుగా ?

ప్రధాన మంత్రి బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ 75వ పడిలోకి అడుగు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 3:32 AM GMT
సన్యాసి అవుదామనుకున్న మోడీ ప్రధాని పీఠం వైపుగా ?
X

ప్రధాన మంత్రి బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ 75వ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆయన 65 ఏళ్ల వయసులో ఈ దేశానికి ప్రధాని అయ్యారు. దాని కంటే ముందు పదమూడేళ్ళ పాటు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేశారు. అంటే మోడీ అధికార పదవులను అందుకోవడం అన్నది ఆయన 52వ ఏట నుంచి మొదలైంది.

మరి అంతవరకూ మోడీ ఏమి చేస్తున్నారు అంటే ఆయన పదహారేళ్ళ ప్రాయం నుంచి రాష్ట్రీయ స్వయం సంఘ్ లో కీలకంగా ఉంటూ వచ్చారు. ఆరెస్సెస్ కి కట్టుబడి కుటుంబ బంధాలను సైతం పక్కన పెట్టి దేశం కోసం అంకితం అయ్యారు. దేశం కోసం ఏవైనా వదులుకోవడానికి మోడీ ఎంత కఠినంగా ఉంటారు అన్నది ఆయన జీవితం చూస్తే అర్ధం అవుతుంది.

ఆయన బంధాలను దూరంగా పెట్టి తానొక్కడిగా ముందుకు వచ్చారు. ఇక ఆయన శ్రీమతి ఇందిరాగాంధీ 1975లో విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ తరువాత కూడా మరో దశాబ్ద కాలం పాటు ఆరెస్సెస్ లోనే ఆయన గడిపారు. ఇక బీజేపీలో 1987లో చేరి గుజరాత్ బాధ్యతలను చూశారు. ఆయన పార్టీలో కార్యదర్శిగా నుంచి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు.

అదే విధంగా బీజేపీని గుజరాత్ లో గెలిపించడంతో తెర వెనక ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. కేశూ భాయ్ పటేల్ కి ఆయన కుడి భుజంగా ఉండేవారు. ఇక 1995లో బీజేపీని అధికారంలోకి తేవడంలో విశేషమైన పాత్ర పోషించారు. ఈ రోజుకు మూడు దశాబ్దాలుగా మరో పార్టీ అన్నది లేకుండా ఏక బిగిన బీజేపీ ఏలుతున్న స్టేట్ దేశంలో ఏదైనా ఉంది అంటే అది గుజరాత్ అనే చెప్పాలి.

మరో వైపు చూస్తే 2001లో కేశూ భాయ్ పటేల్ రాజీనామాతో మోడీ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. ఆనాటి నుంచి నేడు మూడవసారి ప్రధానిగా దేశానికి సేవ చేయడం దాకా చూస్త మోడీ గడచిన ఇరవై మూడేళ్ళుగా అలా అధికార బాధ్యతలలోనే ఉన్నారు.

మోడీ వ్యక్తిగత జీవితం చూస్తే ఆయన చాలా చిన్న వయసులోనే దేశ పర్యటన చేశారు. అలా ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదగా పశ్చిమ బెంగాల్ లోని కోల్ కటా , డార్జిలింగ్ వరకు వెళ్ళారు. ఇక కోల్ కటాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ఆ చిన్న వయసులోనే మోడీ ప్రయత్నం చేయగా అక్కడి నిబంధనలు అంగీకరించక పోవడంతో వెనక్కి వచ్చారు.

అలా అక్కడి నుండి బీహార్ మీదగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం యొక్క ఆశ్రమంలో గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ళు వయస్సులో ఉత్తరభారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి దేశంలోని కీలక ప్రాంతాలు పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. మరో వైపు చూస్తే మోడీలో పట్టుదల ఆయనకు దేశం పట్ల అంకిత భావం ఇవన్నీ ఆరెస్సెస్ వైపుగా నడిపించాయి.

ఆ రోజులలో మోడీ స్వగ్రామమైన వాద్ నగర్ లో గురువు వకీల్ సాబ్ ద్వారా ఆరెస్సెస్ లోకి ప్రవేశించారు. అలా వకీల్ సాబ్ అనుచరుడిగా అనతి కాలంలోనే అహ్మదాబాద్ నగర సంఘ్ శాఖలలో అందరికి పరిచయం అయ్యారు. ఇక 1972లో గుజరాత్ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు, సభ కార్యక్రమాలు, విజయవంతంగా నిర్వహించి అలా మోడీ ఆరెస్సెస్ పెద్దల దృష్టిలో పడ్డారు. అలా ఆనాటి సంఘ్ లో సంస్థ సంఘ్ చాలక్ ల దృష్టి మోడీ మీద పడడంతో సంఘ్ లో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది.

ఇవన్నీ ఇలా ఉంటే మోడీకి మొదటి నుంచి కుటుంబం కంటే దేశం మిన్న అన్న భావన కూడా ఆయన ఆరెస్సెస్ వైపుగా వెళ్లడానికి కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ఏడున్నర పదుల వయసులో అడుగు పెడుతున్న మోడీ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావాలని చూస్తున్నారు. బీజేపీకి ఈ రోజుకీ ప్రజాకర్షణ కలిగిన నేతగా ఉన్న మోడీ 75వ పడిలో అడుగుపెడుతున్న వేళ రానున్న కాలంలో ఏ సంచలనాలు నమోదు చేస్తారో చూడాల్సి ఉంది.