Begin typing your search above and press return to search.

ఉదయనిధి వ్యాఖ్యలపై మోడీ స్పందన

మరోవైపు, స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్ ఆర్ రవికి కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు

By:  Tupaki Desk   |   7 Sep 2023 3:44 AM GMT
ఉదయనిధి వ్యాఖ్యలపై మోడీ స్పందన
X

సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ తన నరికి తెస్తే పది కోట్ల నజరానా అంటూ హిందూ సంఘాల నేతలు ఆఫర్లు ఇస్తున్నారు. అయినా సరే తన వ్యాఖ్యలపై తగ్గేది లేదంటూ ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. ఈ క్రమంలోనే స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలంటూ సీజేఐకి 238 మంది ప్రముఖులు లేఖ కూడా రాశారు.

ఉదయనిధి స్టాలిన్ కు వ్యతిరేకంగా పోలీసు కేసు కూడా నమోదైంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ పరోక్షంగా స్పందించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని బీజేపీ నేతలకు మోడీ పరోక్షంగా సూచించారని తెలుస్తోంది. చరిత్ర లోతుల్లోకి వెళ్లకుండా, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలను ప్రజలకు వివరించాలని మోడీ సూచించారట.

సమకాలీన పరిస్థితులపై మాట్లాడాలని, కానీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని అన్నారట. కానీ, ఆ వ్యాఖ్యలపై బలమైన స్పందన ఉండాలని మోడీ సూచించారని తెలుస్తోంది. ఇక, జీ-20 సదస్సు ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంపై కూడా మోడీ స్పందించారట. ఆ అంశంపై ఎక్కువగా స్పందించవద్దని, సంబంధిత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని కేంద్రమంత్రులతో సమావేశమైన మోడీ సూచించారని తెలుస్తోంది.

మరోవైపు, స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్ ఆర్ రవికి కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. ప్రజల్లో అశాంతిని రేపేలా వ్యాఖ్యానించిన ఉదయనిధి స్టాలిన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరారు స్వామి. మరోసారి సనాతన ధర్మంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయించేందుకు కూడా వెనుకాడేది లేదని స్వామి వార్నింగ్ ఇచ్చారు. భారత్ సమాఖ్య కాదని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తాను 1991లో నిరూపించానని అన్నారు.