తెలంగాణలో మోడీ టూర్... ట్విస్టులతో నవ్వులపాలు
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు ఎన్నికల్లో విజయజెండా ఎగురవేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
By: Tupaki Desk | 24 Sep 2023 3:55 AM GMTతెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని గుర్తింపు పొంది అధికారం చేపట్టాలనుకుంటున్న బీజేపీ ఈ దిశగా చేస్తున్న ప్రయత్నంలోని లోపాలతో నవ్వుల పాలవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు నిర్ణయాలతో రాజకీయ వర్గాల్లో పలుచన అవగా, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ రూపంలో మళ్లీ అదే జరిగిందని అంటున్నారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, అక్టోబర్ 2... ఇలా పలు తేదీలలో ప్రధాని టూర్ అని ప్రచారంలో పెట్టి ఆఖరికి ఓ షెడ్యూల్ ఓకే అవడం పైనే ఈ కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు ఎన్నికల్లో విజయజెండా ఎగురవేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ తమ విదానాలను తెలియజేస్తూ ప్రజల వద్దకు తెలియజేస్తూ పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన గ్యారెంటీలపై విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఒకటీ రెండు రోజుల్లో ఉండనుందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా విడుదల చేసి ప్రధాననమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా సభ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే,
రాష్ట్ర బీజేపీ నేతలు, బీజేపీ పెద్దల నిర్ణయాలు ఆ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాయని అంటున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల శంఖారావం సభగా ప్రధాని మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ సభలు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు.. కనీసం లక్ష మంది ప్రజలను సభకు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. ముందుగా రెండు చోట్ల సభలు పెట్టాలని అనుకొని దాన్ని ఒకటే చోటుకు పరిమితం చేశారు. అక్టోబర్ మొదటి వారంలో సభ ఉంటుందని పేర్కొన్న రాష్ట్ర బీజేపీ నేతలు అక్టోబర్ 2వ తేదీన సభ ఉంటుందని తెలిపారు. అనంతరం ఈ నెల సెప్టెంబరు 30న,మధ్యాహ్నం 12గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ మహబూబ్‌నగర్ జిల్లా భుత్పుర్ ఐ టి ఐ మైదానంలో జరుగనుందని అధికారికంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి శనివారం మధ్నాహ్నం ప్రకటన వెలువడింది.
అయితే, చివరి నిమిషంలో మళ్లీ షెడ్యూల్ మారిపోయింది. ఈ నెల సెప్టెంబరు 30 కి బదులుగా అక్టోబరు 1,మధ్యాహ్నం 1గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా బహిరంగ సభ ఉంటుందని శనివారం రాత్రి ప్రకటన వెలువడింది. దీంతో ఒకే రోజులో రెండు వేర్వేరు ప్రకటనలు విడుదలవడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ బీజేపీని లైట్ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ పెద్దలు షెడ్యూల్ విషయంలో దోబూచులు ఆడుతున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లోనే షెడ్యూల్‌లో మార్పు జరిగిందని బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు.