Begin typing your search above and press return to search.

పీఠంకోసం పాకులాడుతున్నారా ?

నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించటమే ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిలో పీఠంకోసం పాకులాట మొదలైనట్లే ఉంది.

By:  Tupaki Desk   |   15 Aug 2023 6:11 AM GMT
పీఠంకోసం పాకులాడుతున్నారా ?
X

నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించటమే ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిలో పీఠంకోసం పాకులాట మొదలైనట్లే ఉంది. నిజానికి ప్రతిపక్షాల్లోని 24 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడాలంటే పార్టీల అధినేతలకు త్యాగగుణం అన్నది చాలా అవసరం. పదవులను, సీట్లను త్యాగం చేయగలిగినపుడే ఐక్యత అన్నది పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే నరేంద్రమోడీని గద్దె దింపటమే ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసాయి. కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, జనతాదళ్, ఎన్సీపీ లాంటి పార్టీలన్నీ బాధిత పార్టీలే.

అందుకనే అర్జంటుగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పగానే అంగీకరించాయి. రెండుమూడుసార్లు విడివిడిగా అందరితో నితీష్ భేటీ అయిన తర్వాత ముందు పాట్నాలోను తర్వాత బెంగుళూరులోను భేటీ జరిగింది. అయితే ఇక్కడే సమస్య కూడా మొదలైందట. ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరు అనే పాయింట్ చాలా కీలకమైంది. కాంగ్రెస్సేమో ప్రధానమంత్రి పదవి తమకు అంత ప్రాధాన్యత అయినది కాదని ప్రకటించేసింది.

అయితే మిగిలిన పార్టీలు ఇలా ప్రకటించలేదు. నితీష్ కుమార్ అయితే ముస్లింల ఓటుబ్యాంకును కన్సాలిడేట్ చేయటం కోసం రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా నితీష్ వెంట నిలబడాలని ఆ పార్టీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అంటే పరోక్షంగా తానే ప్రధానమంత్రి అభ్యర్ధిని అని నితీష్ చెబుతున్నట్లే ఉంది.

అందుకనే సడెన్ గా బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా రంగంలోకి దూకారు. మమతానే ప్రదానమంత్రి అభ్యర్ధిగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. పార్టీ సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రచారం చేయాలని డిసైడ్ చేశారు. ఇక ఈ పీఠంపై దశాబ్దాలుగా కన్నేసిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఉండనే ఉన్నారు. తనను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించకపోతే ఎన్డీయేలోకి వెళిపోతాననే సంకేతాలను పరోక్షంగా ఇస్తున్నారు. దీంతో ఇండియాకూటమి ఏర్పడినా ప్రధానమంత్రి అభ్యర్ధి అన్న చిక్కుముడి బాగా పెరిగిపోతున్నట్లుంది. బహుశా రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికలే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందేమో.