చరిత్రాత్మక నిర్ణయాలు తప్పవు: ప్రధాని హాట్ కామెంట్స్!
ఈ నేపథ్యంలో ప్రధాని పార్లమెంటు ముందు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
By: Tupaki Desk | 18 Sep 2023 9:01 AM GMTపార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు సెప్టెంబర్ 22 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని మీడియా, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పార్లమెంటు ముందు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా నిలుస్తోందని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ ప్రయాణిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందన్నారు. దేశాభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశాల నిడివి తక్కువే అయినప్పటికీ.. జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని చెప్పారు. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవని తెలిపారు. పార్లమెంట్ సభ్యులంతా దీనికి హాజరుకావాలని కోరారు. ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని ఎద్దేవా చేశారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో ఈ పార్లమెంటు సమావేశాలను నిర్వహించుకుందామని సూచించారు. సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాలుపంచుకోవాలని కోరారు.
చందమామపై మన మిషన్ విజయవంతమైందని ప్రధాని మోదీ తెలిపారు. చంద్రయాన్–3తో మన జెండా సగర్వంగా రెపరెపలాడిందన్నారు. ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ నవ శకానికి స్ఫూర్తి కేంద్రంగా మారిందని చెప్పారు. ఇలాంటి విజయాలు సాధించినప్పుడే శాస్త్ర, సాంకేతికతలో మనమెంత ముందున్నామో ప్రపంచానికి తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
చంద్రయాన్ విజయంతో అనేక అవకాశాలు భారత్ తలుపులు తడుతాయని ప్రధాని మోదీ తెలిపారు. జీ20 సదస్సు అద్భుతంగా జరిగిందన్నారు. భారత ఉజ్వల భవిష్యత్తుకు ఈ సదస్సు మార్గదర్శనం చేసిందని తెలిపారు. జీ20 సదస్సుల్లో మన ప్రతిపాదనలను అన్ని దేశాలు ఆమోదించాయని గుర్తు చేశారు. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం దక్కిందన్నారు.