నేపాల్, కెనడా, పాక్, బంగ్లా, థాయ్, జపాన్, యూకే.. ప్రధానులకు అచ్చిరాని కాలం
ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రులకు గడ్డు కాలం నడుస్తున్నట్లుంది.. భూమికి ఆ చివరన ఉన్న కెనడా నుంచి ఈ చివరన ఉన్న జపాన్ వరకు అందరికీ ఇబ్బందులే
By: Tupaki Desk | 14 Aug 2024 3:30 PM GMTప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రులకు గడ్డు కాలం నడుస్తున్నట్లుంది.. భూమికి ఆ చివరన ఉన్న కెనడా నుంచి ఈ చివరన ఉన్న జపాన్ వరకు అందరికీ ఇబ్బందులే.. (మాజీ) హత్యకు గురికావడమో.. పదవి నుంచి దిగిపోవడమో.. ఎన్నికల్లో ఓడిపోవడమో.. తిరుగుబాటుకు గురికావడమో.. ఇలా ఏదో ఒక పరిణామంతో వార్తల్లోని వ్యక్తులు అవుతున్నారు. కారణాలు ఏమైనా వీరంతా ఒక దేశానికి అధినేతల స్థాయిలో ఉంటూ ప్రపంచవ్యాప్త మీడియాకు కథనాలుగా మారుతున్నారు.
భారత్ పొరుగున బంగ్లా, పాక్, నేపాల్
ఇటీవలి కాలంలో భారత ఉప ఖండంలోని దేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో అందరూ చూశారు. పాక్ లో 2018లో అధికారంలోకి వచ్చిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి దించేశారు. అనేక కేసుల్లో ఇరికించారు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాలో పర్యటించడమే ఇమ్రాన్ పాలిట శాపమైంది. ఇప్పుడు జైల్లో ఉన్న ఇమ్రాన్ బయటకు వచ్చేదెప్పుడు? అని రోజులు లెక్కబెడుతున్నారు. నేపాల్ లో అనూహ్యంగా పుష్పకుమార్ దహల్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. భారత్ కు అనుకూలుడైన దహల్ స్థానంలో భారత్ ను వ్యతిరేకించే కేపీ శర్మ ఓలీ పదవిలోకి వచ్చారు. ఇక అన్నిటికి మించి పది రోజుల కిందట బంగ్లాదేశ్ లో బలవంతురాలైన ప్రధాని షేక్ హసీనాపై ఏకంగా తిరుగుబాటే జరిగింది. దీంతో ఆమె భారత్ లో ఆశ్రయం పొందారు.
భారతీయుడు ఓడిపోయాడు..
రెండేళ్ల కిందట యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైన సందర్భంలో భారతీయులంతా సంబరాలు జరుపుకొన్నారు. ఒకనాడు మనను పాలించిన వారినే మనవాడు పాలిస్తున్నాడని గొప్పలు చెప్పుకొన్నారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో సునాక్ పార్టీ (కన్జర్వేటివ్) ఓడిపోయింది. అయితే, దీనిలో సునాక్ పాత్ర కంటే అంతకుమందు ప్రధానులుగా ఉన్న బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ సాగించిన పాలన సునాక్ కు శాపమైంది. దీంతో ఎన్నికల్లో ఓటమి తప్పలేదు.
తూర్పు తీరంలో..
తూర్పు, ఆగ్నేయ దేశాలపై జపాన్, థాయ్ లాండ్ లో కీలక పరిణామాలు జరగనున్నాయి. థాయ్ ప్రధానమంత్రి స్రెట్టా థావిసిన్ ను రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. కొత్త ప్రధాని పార్లమెంటు ఆమోదం పొందేవరకు ఆపద్ధర్మ పద్ధతిలో ప్రస్తుత కేబినెట్ కొనసాగనుంది.
న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన క్యాబినెట్ సభ్యుడి నియామకానికి సంబంధించిన వ్యవహారంలో ప్రధానమంత్రిపై అక్కడి న్యాయస్థానం వేటు వేసింది. ఇక సెప్టెంబరులో పదవి నుంచి వైదొలగనున్నట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిద ప్రకటించారు. కొత్తవారికి నాయకత్వం అప్పగిస్తానని చెప్పారు. కాగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గత ఏడాది ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే.
కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో ఎంతటి వివాదాస్పదులయ్యారో అందరూ చూశారు. ఖలిస్థానీలకు మద్దతు ఇవ్వడమే కాదు.. తమ దేశంలో హత్యల్లో భారత్ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. భారత్ దీనిపై గట్టిగా స్పందించేసరికి కొంత వెనక్కుతగ్గారు. జి-20 సదస్సుకు భారత్ కు వచ్చిన ట్రూడో విమానం మరమ్మతుకు గురికావడంతో ఒకరోజుకు పైగా ఇక్కడే ఉండిపోయారు. ఇది మరొక అసౌకర్య సందర్భం. స్వదేశంలోనూ ట్రూడోను ప్రజలు దారుణంగా విమర్శిస్తున్నారు. ఆయన రోడ్డుపై వెళ్తుండగా దూషిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, భారత్ లో ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల జరగడం.. అందులో మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచినా, ఆధిక్యం మాత్రం భారీగా తగ్గడం కూడా ‘ప్రధానులకు కలిసిరాని కాలం’ జాబితాలో చూడాల్సిందే.