Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ పై మొన్న తండ్రి.. నేడు అశ్విన్ భార్య కామెంట్స్ వైరల్

అశ్విన్ భార్య పేరు ప్రీతి నారాయణన్‌. తాజాగా తన భర్త రిటైర్మెంట్ పై ఆమె స్పందించింది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 1:30 PM GMT
రిటైర్మెంట్ పై మొన్న తండ్రి.. నేడు అశ్విన్ భార్య కామెంట్స్ వైరల్
X

టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్ కళకు అత్యంత ఆకర్షణీయత తెచ్చినవాడు రవిచంద్రన్ అశ్విన్. హర్భజన్ సింగ్ హవా తగ్గుతున్న సమయంలో అతడి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేశాడు ఈ తమిళ తంబి. క్రికెట్ లో వేగం, టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో టెస్టుల్లో వందల వికెట్లు తీయడం అంటే మామూలు మాటలు కాదు. అంతా మన కళ్లముందే చాప కింద నీరులా సాగిపోయింది. చూస్తుండగానే అశ్విన్ 500 వికెట్లు తీసిన వీరుడయ్యాడు. అలాంటి స్పిన్నర్ మరో రెండేళ్లయినా ఆడతాడని భావిస్తుండగా అన్యూహంగా రిటైర్ అయ్యాడు.

అవమానాలు పడ్డాడా?

అశ్విన్ సడన్ రిటైర్మైంట్ అతడి తండ్రి రవిచంద్రన్ నూ ఆశ్చర్యపరిచిందట. తన కుమారుడి నిష్క్రమణం తనకూ తెలియదని వాపోయాడు. తన కొడుకును అవమానాల పాల్జేశారని, అందుకే అతడు తప్పుకొన్నాడని వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యలను అశ్విన్ ఖండించాడు. తన తండ్రికి ఏం మాట్లాడాలో తెలియక అలా స్పందించారని వివరణ ఇచ్చాడు.

ఇప్పుడు భార్య వంతు..

అశ్విన్ రిటైర్మెంట్ పై అతడి భార్య తాజాగా స్పందించింది. 38 ఏళ్ల అశ్విన్ చాలా కాలం కిందటనే వివాహం చేసుకున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అశ్విన్ భార్య పేరు ప్రీతి నారాయణన్‌. తాజాగా తన భర్త రిటైర్మెంట్ పై ఆమె స్పందించింది. రెండు రోజులుగా ఈ విషయంలో తనకు ఏమీ తోచడం లేదని తెలిపింది. ఏం చెప్పాలా? అని తాను ఆలోచిస్తున్నానని పేర్కొంది. తన ఫేవరెట్ క్రికెటర్‌ (అశ్విన్) గురించా? తన జీవిత భాగస్వామి గురించా? దేని గురించి స్పందించాలో తర్జనభర్జన ఎదుర్కొంటున్నానని పేర్కొంది. ఈ మేరకు ప్రీతి ఇన్‌ స్టాలో భావోద్వేగంతో పోస్టు పెట్టింది. ఈ సుదీర్ఘ పోస్టులో అశ్విన్ కు తనకు ఉన్న అనుబంధం, భర్త సాధించిన విజయాలను ప్రీతి వివరించింది.

ఆ రెండు సందర్భాలు..

2013లో టీమ్ ఇండియా చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. వన్డే ఫార్మాట్ లో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 20 ఓవర్ల చొప్పున నిర్వహించారు. ఆ మ్యాచ్ లో చివరి ఓవర్ ను అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆతిథ్య ఇంగ్లండ్ నుంచి విజయాన్ని గుంజుకున్నాడు. ఈ క్షణాలను చూసి కన్నీరు పెట్టుకున్నామని ప్రీతి తెలిపింది. ఇక మెల్‌ బోర్న్‌, గబ్బా టెస్టుల్లో విజయాలు, 2022లో అశ్విన్ టి20 జట్టులోకి తిరిగివచ్చిన సందర్భంలో తాము భావోద్వేగానికి గురయ్యామని ప్రీతి చెప్పింది.