వినూత్న బ్యాగులతో పార్లమెంటుకు.. తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్
తాజాగా.. ఈ రోజు కూడా మరో కీలక సన్నివేశం చోటుచేసుకుంది.
By: Tupaki Desk | 10 Dec 2024 9:05 AM GMTపార్లమెంట్ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సమావేశాలు వాయిదాలు పడుతూ మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా అదానీ లంచాలపై విచారణ చేపట్టాలంటూ సమావేశాలు ప్రారంభం నాటి నుంచి కాంగ్రెస్ పట్టుబడుతూనే ఉంది. అదానీ అంశాన్ని టార్గెట్‌గా చేసి నిరసనలు తెలుపుతూనే ఉంది. తాజాగా.. ఈ రోజు కూడా మరో కీలక సన్నివేశం చోటుచేసుకుంది.
లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచే అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై చర్చ పెట్టాలని పట్టుబడుతున్నాయి. అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కానీ.. దానిని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై తరువాత చర్చిద్దామని సూచించారు. దాంతో ప్రతిపక్ష పార్టీల నేతలు మరింత రెచ్చిపోయారు. సభలో అల్లర్లు చేస్తూనే ఉన్నారు. దాంతో స్పీకర్ ఇప్పటికే చాలా సార్లు సమావేశాలను వాయిదా వేశారు.
నిన్న కూడా అదానీ, మోడీ బొమ్మలతో కూడిన మాస్కులు ధరించి ప్రతిపక్ష నేతలు పార్లమెంట్‌కు వచ్చారు. వారితోపాటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఉన్నారు. అదానీపై అమెరికాలో కేసు నమోదుపై జీపీసీ విచారణ చేపట్టాలంటే డిమాండ్ చేశారు. అయితే.. కొన్ని రోజలుగా కూడా పార్లమెంటు వెలుపల, లోపల విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మంగళవారం సైతం విపక్ష పార్టీల సభ్యులు తమ నిరసనను కొనసాగించాయి. అదానీపై లంచాలపై, ఆయనపై నమోదైన కేసుపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే మాస్కులతో నిరసనలకు దిగిన నేతలు.. తాజాగా.. వినూత్న రీతిలో బ్యాగులతో నిరసనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, అదానీ చిత్రాలతో పాటు ‘మోడీ అదానీ భాయ్ భాయ్’ అనే నినాదాలతో ముద్రించిన బ్యాగులను చేత్తో పట్టుకొని కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంటుకు వచ్చారు. అవే బ్యాగులను కాంగ్రెస్ ఎంపీలంతా పట్టుకొచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక చేతిలోని ఆ బ్యాగును చూడండి ఎంత క్యూట్‌గా ఉందో అంటూ ఆ బ్యాగును చూపిస్తూ పేర్కొన్నారు. ఆ బ్యాగ్‌పై ఓ వైపు మోడీ, మరోవైపు అదానీ బొమ్మ ఉంది. ఇంతలో ప్రియాంగక గాంధీ మాట్లాడుతూ సభా కార్యక్రమాల్లో తాము పాల్గొనాలనుకుంటున్నామని, కానీ ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదని అన్నారు. ఏదో ఒక సాకుతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తూ వస్తున్నారని అన్నారు.