Begin typing your search above and press return to search.

ప్రియాంక గాంధీకి తొలి సవాల్!

కాంగ్రెస్ నుంచి ప్రియాంక తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పేర్లతో కూడిన లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 11:30 PM GMT
ప్రియాంక గాంధీకి తొలి సవాల్!
X

జమిలి ఎన్నికలపై నియమించిన సంయుక్త పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ నుంచి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలి సవాల్ ను ఎదుర్కొబోతున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ జమిలి ఎన్నికపై ఏర్పాటయ్యే సంయుక్త పార్లమెంట్ కమిటీ (జేపీసీ) సభ్యురాలిగా కాంగ్రెస్ తరఫున ఉంటారని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 17న లోక్ సభలో ప్రవేశపెట్టిన వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చించి ఏకాభిప్రాయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈ సమావేశాల్లో చివరి రోజైన డిసెంబర్ 20 శుక్రవారం సాయంత్రంలోగా స్పీకర్ ఓంబిర్లా జేపీసీ ఏర్పాటు చేయాల్సివుంది. జేపీసీలో సభ్యులుగా ఎవరెవరు ఉంటారనే విషయమై పేర్లు సూచించాలని స్పీకర్ ఆయా పార్టీలను కోరారు.

జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో లోక్ సభ నుంచి 21 మందికి అవకాశం ఉంటుంది. సభలో పార్టీల బలాబలాలు ఆధారంగా సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. సభలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి ఎక్కువ మంది సభ్యులను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం లభించనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తోపాటు విపక్షంలోని కొన్ని పార్టీలు, ఎన్డీఏ కూటమిలోని బీజేపీ మినహా మిగిలిన పార్టీలు తమ పార్టీ తరఫున జేపీసీలో సభ్యులుగా ఉండనున్న ఎంపీల పేర్లను స్పీకర్ ఓం బిర్లాకు నివేదించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి ప్రియాంక తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పేర్లతో కూడిన లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరులో ఒకరు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కాగా, మరొకరు మనీశ్ తివారీ పేర్లను సూచించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోని టీడీపీ నుంచి అమలాపురం పార్లమెంట్ సభ్యుడు హరీశ్ బాలయోగి, జేడీయూ నుంచి సంజయ్ ఝా, శివసేన (షిండే) పార్టీ తరఫున మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పేర్లు సిఫార్సు చేశారు. విపక్షంలో డీఎంకే పార్టీ ఎంపీలు విల్సన్, సెల్వ గణపతి, టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలే పేర్లను స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు చెబుతున్నారు.

ప్రియాంకకు సవాల్ జేపీసీలో సభ్యురాలు కాబోతున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఇది తొలి సవాల్ అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. గత దశాబ్దకాలంగా ఈ దిశగా అడుగులు వేస్తోంది. సొంతంగా బలం లేకపోయినా, మూడోంతుల మెజార్టీ సాధించాల్సివున్నప్పటికీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణకు బిల్లు ప్రవేశపెట్టింది. సంపూర్ణ మెజార్టీ లేనందున జేపీసీ నియమించి ఏకాభిప్రాయం తేవాలని ప్రయత్నిస్తోంది. అయితే జేపీసీలో ప్రభుత్వ ఎత్తుగడలను అడ్డుకోవాల్సిన బాధ్యత విపక్షంపై ఉంది. జమిలి ఎన్నికలు తేవాలని బీజేపీ ఎంత బలంగా కోరుకుంటుందో.. ఇండియా కూటమి పార్టీలు అంతే వ్యతిరేకత చూపుతున్నాయి. విపక్షంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ దీనికి నాయకత్వం వహించాల్సివుంటుంది. ఈ బాధ్యతను అగ్రనేత ప్రియాంకకు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ తాజా సమావేశాల్లో అనర్గళంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు జేపీసీలోనూ అంతే సమర్థంగా పనిచేసి విపక్షం ఆశలను నెరవేర్చాల్సివుంది. దీంతో ప్రియాంక పాత్రపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.