Begin typing your search above and press return to search.

పార్లమెంటులోకి ప్రియాంక.. రాజకీయ నిపుణుల విశ్లేషణలు ఇలా..

కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎంపీలుగా గెలుస్తూనే ఉన్నారు. అదే ఫ్యామిలీ నుంచి దేశానికి ప్రధానులు సైతం అయ్యారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 6:47 AM GMT
పార్లమెంటులోకి ప్రియాంక.. రాజకీయ నిపుణుల విశ్లేషణలు ఇలా..
X

కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎంపీలుగా గెలుస్తూనే ఉన్నారు. అదే ఫ్యామిలీ నుంచి దేశానికి ప్రధానులు సైతం అయ్యారు. అయితే.. తాజాగా అదే ఫ్యామిలీ నుంచి ప్రియాంక గాంధీ సైతం ఎంపీగా గెలుపొందడంతో ఆ ఫ్యామిలీలో కనిపించిన ఆనందం అంతాఇంతా కాదు.

కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఆమె బంపర్ విజయం సాధించారు. ఆమె సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. అయితే.. ఆమె తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగడం.. మొదటిసారే భారీ విక్టరీ సాధించడంతో గాంధీ ఫ్యామిలీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ సంబరాలు కనిపించాయి.

ఈ మేరకు నేడు ప్రియాంక గాంధీ పార్లమెంటులో తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. మొట్టమొదటి సారి ఆమె పార్లమెంటులో అడుగుపెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ రెండు చోట్ల పోటీచేసి గెలుపొందారు. రెండుచోట్ల గెలుపొందడంతో ఓ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో రాహుల్ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఆ స్థానానికి తన చెల్లి ప్రియాంక గాంధీని పోటీలో నిలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఘన విజయం సాధించారు.

అయితే.. మొదటిసారి ప్రియాంక పార్లమెంటులోకి అడుగుపెట్టడంతో ఆమెపై పలు విషయాలు ట్రోల్స్ అవుతున్నాయి. ఇందిరాగాంధీ మరోసారి పార్లమెంటులోకి వచ్చారన్న అభిప్రాయం వెల్లడవుతోంది. ఇందిరాగాంధీ వారసత్వాన్ని ఆమె పుణికి పుచ్చుకుంటారన్న టాక్ నడుస్తోంది. ప్రియాంక సామర్థ్యంపై రాజకీయ నిపుణులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఇందిరాగాంధీలోని కొన్ని క్వాలిటీస్ ఆమెలో కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రియాంకకు మంచి వ్యూహకర్తగా మాత్రమే పేరుంది. ఇప్పుడు మంచి నాయకురాలిగానూ గుర్తింపు సాధిస్తారని అంటున్నారు. మీడియాకు సమాధానాలు చెప్పడంలోనూ, ప్రత్యర్థులను విమర్శించడంలోనూ ఆమె నేర్పరి అని అంటున్నారు. అంతేగాకుండా హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్పష్టంగా మాట్లాడగలిగే సామర్థ్యం, నైపుణ్యం ఆమెలో ఉండడంతోపాటు ఇందిరాగాంధీ వారసత్వం కూడా ఓ మైలేజీ అని అంటున్నారు.