Begin typing your search above and press return to search.

మొదలుపెట్టిన ప్రియాంక గాంధీ... రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల తర్వాత దేశంలో మరో అత్యంత ఆసక్తికరమైన పోరు జరగబోతోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 8:59 AM GMT
మొదలుపెట్టిన ప్రియాంక గాంధీ... రాహుల్  ఆసక్తికర వ్యాఖ్యలు
X

హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల తర్వాత దేశంలో మరో అత్యంత ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఇందులో భాగంగా... రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ వేశారు.

అవును... మంగళవారం సాయంత్రం కేరళకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా... తన తల్లి సోనియా గాంధీతో కలిసి బుధవారం వయనాడ్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఉన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ... వయనాడ్ అవసరాల కోసం ఉద్వేగభరితమైన ఛాంపియన్ గా, పార్లమెంట్ లో శక్తివంతమైన వాయిస్ గా ప్రియాంక ఎదుగుతారని అన్నారు. వయనాడ్ ప్రజలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని.. వారికి తన సోదరి ప్రియాంక గాంధీ కంటే మెరుగైన ప్రతినిధిని తాను ఊహించలేనని తెలిపారు.

కాగా... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్ బరేలీ తో పాటు, కేరళ లోని వయనాడ్ లోనూ విజయం సాధించారు. అనంతరం.. వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో వయనాడ్ లో ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ప్రియాంకా గాంధీ.. సోమవారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.

వయనాడ్ ఉప ఎన్నికలో మరోపక్క ప్రియాంక గాంధీపై భారతీయ జనతాపార్టీ తన అభ్యర్థిని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. నవ్య హరిదాస్ ను ఎంపిక చేసింది. ఇదే సమయంలో.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరుపున సత్యన్ మొకేరి పోటీ చేయనున్నారు. దీంతో.. ఈ ఉప ఎన్నికలో వయనాడ్ లో త్రిముఖ పోరు తప్పదని అంటున్నారు.