ప్రియాంక పోటీకి వెనుకంజ వేసింది ఇందుకేనా?
ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తే బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ప్రియాంక పోటీకి విముఖత చూపారని అంటున్నారు.
By: Tupaki Desk | 3 May 2024 6:53 AM GMTఎట్టకేలకు నామినేషన్లు వేయడానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలయిన అమేథి, రాయబరేలిల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. రాయబరేలి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, అమేథి నుంచి కేఎల్ శర్మలను ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఉత్కంఠ వీడింది.
రాయబరేలిలో 2004 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ సోదరి, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.
నామినేషన్లకు ఒక్క రోజే మిగిలి ఉన్నా చివరి వరకు కాంగ్రెస్ కంచుకోటలయిన అమేథి, రాయబరేలి స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించకపోవడంతో ఉత్కంఠ తారాస్థాయిని అందుకుంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది.
కాగా ప్రియాంక గాంధీ రాయబరేలి నుంచి పోటీ చేయకపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర బీజేపీ నేతలు కాంగ్రెస్ ను వారసత్వ పార్టీ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటికే సోనియా కుటుంబం నుంచి ఆమెతోపాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎంపీలుగా ఉన్నారు. సోనియాగాంధీ 1998 నుంచి రాహుల్ గాంధీ 2004 నుంచి ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీలుగా కొనసాగుతుండటంతో ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తే బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ప్రియాంక పోటీకి విముఖత చూపారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే అమేథి, రాయబరేలిల్లో ఎక్కడో చోట నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రతిపాదనను ప్రియాంక గాంధీ తోసిపుచ్చారని అంటున్నారు. బీజేపీ వారసత్వ రాజకీయాల విమర్శలకు భయపడే ప్రియాంక పోటీకి విముఖత చూపినట్టు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఓటమి భయంతోనే ప్రియాంక గాంధీ పోటీ చేయడం లేదని విమర్శిస్తోంది. అలాగే అమేథిలో ఓటమి భయం వెంటాడటం వల్లే రాహుల్ గాంధీ అక్కడి నుంచి పారిపోయి రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది.