కాంగ్రెస్‌లో ప్రియాంక 'కుంపటి'.. రెండుగా చీలుతుందా?
ఇదే విషయాన్ని పార్టీ బహిష్కృత నాయకుడు.. ఆచార్య ప్రమోద కృష్ణ వెల్లడించారు.
By: Tupaki Desk | 5 May 2024 9:51 AM GMTప్రస్తుత ఎన్నికలను సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మోడీని గద్దె దించడం ద్వారా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. ఢిల్లీ కోటను దక్కిం చుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. అయితే.. తాజాగా జరిగిన సమీకరణలు పార్టీలో కల్లోలం రేపుతున్నా యి. ముఖ్యంగా ప్రియాంక గాంధీ సెంట్రిక్‌గా జరుగుతున్న వ్యవహారాలు పార్టీపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ బహిష్కృత నాయకుడు.. ఆచార్య ప్రమోద కృష్ణ వెల్లడించారు.
ఏం జరిగింది?
ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పోటీ నుంచి తప్పుకొన్నారు. ఆమె రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఆమె ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చిన యూపీలోని రాయబరేలీ నియోజకవర్గం ఖాళీ అయింది. ఇక, యువ నేత రాహుల్ గాంధీ గత ఎన్నికల వరకు పోటీ చేసిన అమేదీ నియోజకవర్గం కూడా.. ఖాళీ అయింది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓడిపోయారు. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ నుంచి గెలిచారు. ఇక, ఇప్పుడు కూడా రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమేధీ నుంచి ఆయన పోటీ చేయడం లేదు. కానీ.. ఇదేసమయంలో సోనియా పోటీ నుం చి తప్పుకొన్న రాయబరేలి నుంచి రాహుల్ బరిలో ఉన్నారు. అంటే.. ఒక సీటు అమేధీ ఖాళీ అయింది. ఈ సీటును రాహుల్ బావ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి.. మరీ అమేధీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కానీ, చివరకు పార్టీ వేరే వారిని ఎంచుకుని.. కిశోరీ లాల్ కు అవకాశం ఇచ్చింది.
ఇది రాబర్ట్‌కు నచ్చలేదు. ఇది ఒక కుంపటి అయితే.. మరోవైపు.. ప్రియాంక గాంధీ.. రాయబరేలి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక మౌనం వహించి.. చివరకు ఆమె కు ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. ఇది మరింతగా పార్టీలో అంతర్గత కుమ్ములాటకు దారితీసింది. ఈ రెండు పరిణామాలకు తోడు.. రాహుల్‌గాంధీ అమేదీ నుంచి పోటీ చేయకుండా వెళ్లిపోవడం.. అక్కడి కార్యకర్తల్లోనూ అసంతృప్తికి దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గాంధీల కుటుంబంలో టికెట్ల చిచ్చు రగల్చిందన్నది ప్రమోద్ కృష్ణ చేస్తున్న ప్రధాన విమర్శ.
దీనిని బట్టి ప్రియాంక గాంధీపై పార్టీలో కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ త్వరలో చీలి పోతుందని, రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గాలుగా చీలిపోవడం ఖాయమని ప్రమోద్ చేస్తున్న విశ్లేషణ. ఈయన పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరణకు గురయ్యారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే.. ప్రమోద్ చెప్పింది నిజమేననే వాదన కూడా వినిపిస్తోంది. రేపు రిజల్ట్ తర్వాత.. పార్టీలో పెనుకుదుపు వచ్చే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు.