Begin typing your search above and press return to search.

రాహుల్ ఉత్తరాది ప్రియాంక దక్షిణాది

కాంగ్రెస్ లో ఇక ఆ ఇద్దరే చోదక శక్తులుగా మారి పార్టీని విజయపధంలో నడిపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 3:49 AM GMT
రాహుల్ ఉత్తరాది ప్రియాంక దక్షిణాది
X

కాంగ్రెస్ లో ఇక ఆ ఇద్దరే చోదక శక్తులుగా మారి పార్టీని విజయపధంలో నడిపించబోతున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ని సెంచరీ దాకా తీసుకుని వచ్చిన అన్నాచెల్లెలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీల బాధ్యత ఈ ఎన్నికలతో మరింతగా పెరిగినట్లు అయింది.

ఈ ఇద్దరి నాయకత్వంలో ఇండియా కూటమి కూడా 232 సీట్లను సాధించింది. అంటే అధికారానికి చాలా దగ్గరగా వచ్చినట్లే అని అంటున్నారు. ఈ క్రమంలో రానున్న అయిదేళ్ల పాటు ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. అందుకే ఉత్తరాదిని రాహుల్ గాంధీ దక్షిణాదిని ప్రియాంకా గాంధీ చూసుకునేలా పార్టీ ఏర్పాట్లు చేసింది అని అంటున్నారు.

తాజా ఎన్నికల్లో రాహుల్ గాంధీ దక్షిణాదిన కేరళలో ఉన్న వయనాడ్ లోక్ సభ సీటుని అలగే యూపీలో ఉన్న రాయబరేలీలోనూ గెలిచారు. ఇపుడు రాహుల్ ఈ రెండు సీట్లలో ఏది ఉంచుకుంటారు ఏది త్యాగం చేస్తారు అన్న చర్చ సాగింది. దానికి కాంగ్రెస్ మార్క్ సొల్యూషన్ కూడా ఉంది అని అంటున్నారు.

తాత ఫిరోజ్ ఖాన్ నుంచి నాయనమ్మ ఇందిరాగాంధీ నుంచి రాహుల్ వరకూ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీనే తన పర్మనెంట్ సీటు గా ఉంచుకోవడానికి రాహుల్ చూస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా అదే మేలైన ఆలోచనగా చెబుతోందిట. ఈసారి ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ పంట పండింది. ఏకంగా ఆరు సీట్లు గెలిచింది.

2019లో ఇదే కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది. ఈసారి అదనంగా అయిదు గెలుచుకుంది. దాంతో యూపీ మీద ఫోకస్ పెడితే మరిన్ని సీట్లు సాధిస్తే 2029లో కేంద్రంలో అధికారం తమదేనని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఈ లక్ష్యం నెరవేరాలీ అంటే ఉత్తరాదిన రాహుల్ ఉండాలని అందుకే రాయబరేలీ ఉంచుకోవాలని డిసైడ్ చేసిందట

ఇక దక్షిణాదిన చూసుకుంటే కేరళలో మొత్తం 20 సీట్లకు గానూ కాంగ్రెస్ 14 సీట్లను గెలుచుకుంది. అలాగే దక్షిణాదిన కర్నాటకలో ఈసారి తొమ్మిది ఎంపీ సీట్లు దక్కించుకుంది. తెలంగాణాలో ఎనిమిది తెచ్చుకుంది. అదే విధంగా తమిళనాడులో తొమ్మిది ఎంపీ సీట్లను గెలుచుకుంది

అంటే మొత్తంగా 40 ఎంపీ సీట్లను సౌత్ లో కాంగ్రెస్ ఈసారి గెలుచుకోబట్టి సెంచరీ కొట్టింది. ఇక మీదట సౌత్ లో కాంగ్రెస్ మరింతగా ఫోకస్ పెడితే మొత్తం 129 ఉన్న సీట్లలో ఇంకా పెద్ద ఎత్తున గెలుచుకునే చాన్స్ ఉంటుందని లెక్క వేస్తుంది. దాంతో రాజకీయంగా దూకుడుగా ఉండే ప్రియాంకా గాంధీని రాహుల్ గాంధీ పోటీ చేసిన వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీకి పెట్టాలని పార్టీ డిసైడ్ అయింది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ సీటును వదులుకోవద్దని అమేథీ కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ ఇప్పటికే రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. రాహుల్ వయనాడ్‌ను వదులుకోవచ్చని కేరళ కాంగ్రెస్ చీఫ్ సుధాకరన్ కూడా సంకేతాలిచ్చారు. ఆ విధంగా చూస్తే ప్రియాంకా గాంధీ సౌత్ ఇండియాలో రానున్న రోజులలో కాంగ్రెస్ తరఫున కీలక పాత్ర పోషిస్తారు అని అంటున్నారు.