Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్' ట్యాక్స్ కు 'ఎఎ'ట్యాక్స్ కౌంటర్

ఈ సందర్భంగా మోడీ మీద విరుచుకుపడ్డారు. దేశం మీద ఎఎ ట్యాక్స్ విధించినట్లుగా ప్రియాంక ఫైర్ అయ్యారు. దేశ ప్రజల మీద మోడీ ఎఎ (అదానీ - అంబానీ) ట్యాక్స్ విధించారన్నారు.

By:  Tupaki Desk   |   12 May 2024 5:28 AM GMT
ఆర్ ఆర్ ట్యాక్స్ కు ఎఎట్యాక్స్ కౌంటర్
X

ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ప్రత్యర్థులు చేపట్టిన ప్రచారానికి కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా కళ్లు తెరిచింది. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం మొదలు స్థానిక నాయకుల వరకు ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ రాహుల్.. రేవంత్ పై విరుచుకుపడటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందన్న ప్రచారానికి తెర తీశారు.

ఆర్ఆర్ ట్యాక్స్ రాగాన్ని విపక్ష బీఆర్ఎస్ సైతం అందుకుంది. అయితే.. దీనికి అంతే తీవ్రంగా కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ వెనుకబడిందన్న మాట బలంగా వినిపించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు జరిగే నష్టానికి ఆర్ఆర్ ట్యాక్స్ ప్రచారం కారణమన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్.. ప్రచారానికి మిగిలి ఉన్న చివరి రోజున దిద్దుబాటు చర్యలకు తెర తీయటం గమనార్హం.

ఆర్ఆర్ ట్యాక్స్ కు కౌంటర్ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కీలక నేత అయిన ప్రియాంక తీసుకున్నారు. ప్రచారానికి ఉన్న ఆఖరి రోజున హాజరైన కార్యక్రమంలో తన కౌంటర్ ను వినిపించారు. దేశానికి నియంతలా వ్యవహరించే.. అబద్ధాలు చెప్పే మోడీ కావాలో.. బలమైన ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం.. రిజర్వేషన్ల కోసం పోరాడే రాహుల్ కావాలో ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయించుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా మోడీ మీద విరుచుకుపడ్డారు. దేశం మీద ఎఎ ట్యాక్స్ విధించినట్లుగా ప్రియాంక ఫైర్ అయ్యారు. దేశ ప్రజల మీద మోడీ ఎఎ (అదానీ - అంబానీ) ట్యాక్స్ విధించారన్నారు. పేదల ధనాన్ని బిలియనీర్లకు దోచిపెట్టినట్లుగా మండిపడిన ఆమె.. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. "70 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నా 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రైతుల రుణాలు మాఫీ చేయలేదు. నోట్ల రద్దు.. జీఎస్టీ అమలు.. ధరల పెరుగుదల.. నిరుద్యోగం.. విద్వేషాన్ని పేదలకు బహుమతిగా ఇచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలైనాఇస్తారు కానీ రాజ్యాంగాన్ని మార్చనీయబోరు. రాజ్యాంగాన్ని మోడీ రాయలేదు. దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు" అంటూ మోడీపై మండిపడ్డారు.

ప్రియాంక సభలో వినిపించిన కొత్త మాట ఏదైనా ఉందంటే అది ఎఎ ట్యాక్స్. ఈ అంశాన్ని మరికాస్త ముందుగా మొదలుపెట్టినా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ.. ఇంత ఆలస్యంగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావటాన్ని తప్పు పడుతున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ కు కౌంటర్ గా కాంగ్రెస్ వ్యూహకర్తలు కాస్తంత ముందుగా ఎఎ ట్యాక్స్ అంశాన్ని తీసుకొచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.