సినీ నిర్మాత కేదార్ అంత్యక్రియలు దుబాయ్ లోనే!
సంచలనంగా మారిన తెలుగు సినీ నిర్మాత కేదార్ అంత్యక్రియలు దుబాయ్ లో పూర్తి అయ్యాయి.
By: Tupaki Desk | 4 March 2025 10:34 AM ISTసంచలనంగా మారిన తెలుగు సినీ నిర్మాత కేదార్ అంత్యక్రియలు దుబాయ్ లో పూర్తి అయ్యాయి. నిర్మాతగా తీసిన సినిమాల కంటే కూడా.. సినీ ప్రముఖులతోనూ.. హైదరాబాద్ లోని పలు పవర్ సెంటర్లలో ఆయనకున్న పలుకుబడి.. ఆయనకున్న పరిచయాలు.. నెట్ వర్కు ఒక స్థాయిలో ఉంటాయని చెబుతారు. కోరినంతనే ఇట్టే చార్టర్ ఫ్లైట్ బుక్ చేసే టాలెంట్ ఆయనకు సొంతం. దుబాయ్ లోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మరణించటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. ఆయనతో పాటు రోజుల తరబడి కొందరు రాజకీయ నేతలు కూడా ఆయన ప్లాట్ లో ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఆయన మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ అధికారులు తేల్చారు. పోలీసుల విచారణ ముగిసిన అనంతరం కేదార్ అంత్యక్రియలు దుబాయ్ లో జరపటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారతీయ కాన్సులేట్ తరఫున అసిస్టెంట్ కాన్సులర్ ఆఫీసర్ ఉమేశ్ యాదవ్ ఎన్ వోసీని జారీ చేశారు. దీంతో.. అమెరికా పాస్ పోర్టు ఉన్న కేదార్ సతీమణి రేఖా వీణకు డెడ్ బాడీని అప్పగించారు. దీంతో.. దుబాయ్ లోనే కేదార్ అంత్యక్రియల్ని పూర్తి చేశారు.
సినీ.. రాజకీయ ప్రముఖులతో ఉన్న సంబంధాల కారణంగా తమ కుటుంబం ఇప్పటికే చాలానే నష్టపోయిందని.. అందుకే అంత్యక్రియలైనా సరే వారందరికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా కేదార్ కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా ప్రముఖ మీడియాలో పేర్కొన్నారు. భారత్ కు డెడ్ బాడీని తీసుకొస్తే.. ఎయిర్ పోర్టు మొదలు దహన సంస్కారాల వరకు మీడియా హడావుడి ఎక్కువగా ఉంటుందని.. అందుకే దుబాయ్ లోనే అంత్యక్రియలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. కేదార్ అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులు తప్పించి ఇంకెవరు పాల్గొనక పోవటం గమనార్హం.