మేధావి సాయిబాబా మరణం.. కొన్ని ప్రశ్నలు.. !
సమాజంలో చావు పుట్టుకలు అనేవి కామన్. దేశవ్యాప్తంగా రోజుకు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు.
By: Tupaki Desk | 15 Oct 2024 10:30 AM GMTసమాజంలో చావు పుట్టుకలు అనేవి కామన్. దేశవ్యాప్తంగా రోజుకు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. అదేసమయంలో అంతకు మించిన సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. అయితే.. అన్ని చావులను ఒకే విధంగా చూడలేం. ఒక వ్యక్తి చనిపోతే.. మరికొందరు వ్యక్తులు పుట్టుకొస్తారు. కానీ, ఒక మేధావి చనిపోతే.. మరో మేధావి పుట్టుకొస్తారని కానీ, తయారవుతారని కానీ చెప్పలేదు. ఇలా.. కొన్ని చావులు చరిత్ర సృష్టిస్తాయి. మరికొన్ని చరిత్రను ప్రశ్నిస్తాయి. ఇప్పుడు ఇలాంటి మరణమే సంభవించింది.
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీచ్యుతులైన ప్రొఫెసర్ జీ. నాగ సాయిబాబా (అమలాపురం వాసి, హైదరాబాద్‌లో నివాసం, ఢిల్లీలో ఉద్యోగం) శనివారం రాత్రి చనిపోయారు. అనారోగ్య కారణాలతో ఆయన కొన్నాళ్లుగా చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం గాల్ బ్లాడర్‌లో రాళ్లను తొలగించేందుకు చేసిన ఆపరేషన్ విఫలమై..(ఇది చాలా చిన్న ఆపరేషన్. అయినా.. ఆయన శరీరం సహకరించలేదు) తుదిశ్వాస విడిచారు.
ఇలాంటి మరణాలు సహజం. రోజుకు ఎంతోమంది అనేక కారణాలతో మృతి చెందుతున్నారు.కానీ, ఎవరి మరణమూ ప్రశ్నలను వదిలి పెట్టలేదు. కానీ, సాయిబాబా మరణం కొన్ని ప్రశ్నలను ఈ సమాజానికి, ప్రభుత్వాలకు, కోర్టులకు కూడా.. వదిలి వెళ్లింది. దేశం నేర న్యాయ చట్టాన్ని బోనులో నిలబెట్టింది. అయితే.. చిత్రం ఏంటంటే.. ఈ ప్రశ్నలకు కానీ.. సాయిబాబా మరణానికి వెనుక ఉన్న కారణాలకు కానీ.. సమాధానం చెప్పేందుకు ఎవరూ సాహసించకపోవడం అత్యంత దురదృష్టకరం.
ఏంటా ప్రశ్నలు?
+ అసలు సాయిబాబాను ఎందుకు అరెస్టు చేశారు? ఎందుకు పదేళ్ల మూడు మాసాల 22 రోజులు జైల్లో ఉంచారు? అంటే.. దీనికి సమాధానం లేదు.
+ ఎన్ ఐఏ అధికారులు చెబుతున్నట్టు సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? అంటే.. నిరూపించలేక పోయారు. పైగా.. నిజంగానే మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉంటే.. మావోయిస్టులు ఎందుకు మౌనంగా ఉన్నారు? వారు స్పందించేవారు కదా! అనేదానికి కూడా ఎవరి దగ్గరా జవాబు లేదు.
+ సాయిబాబా అరెస్టు అయిన వెంటనే ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను పదవీచ్చుతుడిని చేసింది. అంటే ఉద్యోగం తీసేయలేదు. ఉద్యోగం నుంచి తొలగించింది. తీసేస్తే.. ఆయనకు పింఛను.. ఇతరత్రా లబ్ధి చేకూరేది. కానీ, పదవీచ్చుతుడిని చేయడం ద్వారా.. ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఆర్థిక దిగ్బంధనం చేశారు. దీనికి కారణం ఏంటి? వెనుక ఎవరున్నారు? దీనికి సమాధానం తెలిసినా.. చెప్పే గొంతులు పెగలడం లేదు.
+ అసలు.. సాయిబాబా అరెస్టు వెనుక.. నిజంగానే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? ఆయన ప్రేరేపిత మావోయిజానికి పూనుకొన్నారా? అంటే.. కాదనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. మరి ఎందుకు ఇంత ఘోరంగా ఆయనను పదేళ్ల పాటు హింసాయుత జైల్లో బందీని చేశారు? అనేది.. రాజ్యం వైపు చూపిస్తున్న వేళ్లు కనిపిస్తున్నాయే తప్ప.. నోరు ఎవరికీ రావడం లేదు.
మొత్తంగా.. సాయిబాబా మరణం.. వెనుక.. భావప్రకటనా స్వేచ్ఛ తాలూకు నిజాలు, నిగ్నసత్యాలు ఉన్నాయనేది వాస్తవం. అధికార పీఠాలను కైవసం చేసుకున్నవారి అంతర్గత విషయాలు వెల్లడి చేయడమే.. వాటిని ప్రశ్నించడమే.. సాయిబాబా చేసిన నేరం. అంతకుమించి.. ఆయనకు తెలిసిన పాపం మరొకటి లేదన్నది ప్రతి మేధావికీ తెలుసు. కానీ, రాజ్యం బందీలను మాత్రమే కాదు.. మూగనోము కూడా పట్టించగలదన్న వాస్తవం.. సాయిబాబా మరణం మనకు నేర్పుతోంది.