'రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప-2 ని అడ్డుకుంటాం'... తెలంగాణలో తాజా ఇష్యూ!
‘పుష్ప-2’ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ కి టీమ్, ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Dec 2024 9:51 AM GMT‘పుష్ప-2’ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ కి టీమ్, ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారని అంటున్నారు. మరో పక్క.. సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని.. ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.
మరోపక్క అల్లు అర్జున్ పై వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇందులో భాగంగా.. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసిన బక్క జడ్సన్.. జరిగిన దారుణానికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ.. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా పీ.డీ.ఎస్.యూ. ఎంట్రీ ఇచ్చింది.
అవును... ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) తాజాగా ఓ కీలక డిమాండ్ తెరపైకి తెచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్ల రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు.. ఆమె కొడుకు చావు బతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.
ఇప్పటికే సినిమా టిక్కెట్ రేట్లను రూ.3 వేలకు వరకూ పెంచి.. పేద, మధ్య తరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులు గుల్ల చేశారని అన్నారు. సినిమా వినోదాలను పంచేదిగా ఉండాలి కానీ.. విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. అర్ధరాత్రి సినిమా హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారంటూ ప్రశ్నించారు!
ఆరుగాలం చెమటోడ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు.. పెట్టుబడిదారులు సినిమాలు తీస్తే మాత్రం ప్రత్యేకమైన జీవోలు తెచ్చిమరీ టిక్కెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారని.. వీరి కపట నీతిని విద్యార్థులు, యువకులు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ కీలక డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఇది వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా... "ఈ ఘటనకు కారణమైన జీరో (హీరో కాదు) అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప-2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము" అంటూ కీలక ప్రకటన విడుదల చేశారు.