Begin typing your search above and press return to search.

బంగ్లాలో మళ్లీ అల్లర్లు.. ఈ సారి అధ్యక్షుడిపై గురి

అయితే, హసీనా దిగిపోయాక పరిస్థితులు సద్దుమణిగాయని భావించారు. కాగా, తాజాగా బంగ్లాదేశ్‌ అధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు అనూహ్యంగా ముట్టడించారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 7:13 AM GMT
బంగ్లాలో మళ్లీ అల్లర్లు.. ఈ సారి అధ్యక్షుడిపై గురి
X

పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి.. సరిగ్గా ఆగస్టు మొదటివారంలో అట్టుడికిన బంగ్లాలో పరిస్థితులు సద్దుమణిగాయనుకుంటే మళ్లీ తిరగబెట్టాయి. నిరసనలు పోయి అల్లర్లకు దారితీస్తున్నాయి. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత దేశంలో ఆశ్రయం పొందుతుండగా.. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మొహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టి రెండు నెలలు దాటినప్పటికీ.. పరిస్థితులు సద్దుమణిగినట్లు లేవు. తాజాగా జరుగుతున్న పరిణామాలు దీనినే సూచిస్తున్నాయి.

నాడు రిజర్వేషన్లు..

బంగ్లాలో జనవరిలో హసీనా పార్టీ అవామీ లీగ్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అంతా సాఫీగానే ఉన్నట్లు పైకి కనిపించినా.. జూలైలో ఒక్కసారిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. అవి మరింత తీవ్రంగా మారి విధ్వంసానికి దారితీశాయి. చివరకు నిరసనలతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి హుటాహుటిన భారత్ కు వచ్చేశారు. ఇదంతా ఆగస్టు 5వ తేదీన జరిగింది. అనంతరం హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించి విధ్వంసానికి దిగారు. అయితే, హసీనా దిగిపోయాక పరిస్థితులు సద్దుమణిగాయని భావించారు. కాగా, తాజాగా బంగ్లాదేశ్‌ అధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు అనూహ్యంగా ముట్టడించారు. ఆయన రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. దీనికి ఢాకాలోని సెంట్రల్‌ షాహీద్‌ మినార్‌ వేదికైంది ఇక్కడ విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీకి దిగారు.

ఇవీ వారి డిమాండ్లు..

గతంలో హసీనా రాజీనామాకు ఉద్యమించిన నిరసనకారులు ఆమె ప్రభుత్వానికి గతంలో సన్నిహితంగా వ్యవహరించిన అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ రాజీనామాకు పట్టుబడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 1972లో రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి.. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని.. అవామీ లీగ్‌ పార్టీకి చెందిన బంగ్లాదేశ్‌ చాత్ర లీగ్‌ ను నిషేధించాలని కోరుతున్నారు. హసీనా ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను డిస్ క్వాలిఫై చేయాలని అంటున్నారు. జూలై- ఆగస్టుల్లో జరిగిన నిరసనల స్ఫూర్తికి అనుగుణంగా గత ప్రభుత్వ ఛాయలు లేకుండా బంగ్లాదేశ్‌ ను రిపబ్లిక్‌ గా ప్రకటించాలని కోరుతున్నారు. ఇలా పలు డిమాండ్లను తెరపైకి తెచ్చారు.

హింస తప్పదా..?

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లా లో ఆగస్టులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆందోళనల తీవ్రతో కనీసం జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశమూ ఇవ్వలేదు. తర్వాత ఆమె రాజీనామాతో బంగ్లాలో అవామీ లీగ్‌ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే, మరో నాలుగేళ్లు అవకాశం ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.